shiela Dikshit
-
‘షీలా దీక్షిత్‌లానే మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు’
న్యూఢిల్లీ: ట్విటర్లో యాక్టీవ్‌గా ఉండే ప్రముఖుల్లో సుష్మా స్వరాజ్ ముందు వరుసలో ఉంటారు. ఆపదలో ఉండి సాయం కోరే వారి విషయంలో తక్షణమే స్పందించే సుష్మా స్వరాజ్.. కామెంట్ చేసే వారికి కూడా దిమ్మ తిరిగే సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ట్విటర్ వేదికగా చోటు చేసుకుంది. నిన్న ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాంగే రామ్ మరణించారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఇర్ఫాన్ ఖాన్ అనే ఓ ప్రబుద్ధుడు సుష్మా ట్వీట్‌పై స్పందిస్తూ.. ‘షీలా దీక్షిత్ లానే మిమ్మల్ని కూడా ఏదో రోజు దేశమంతా తల్చుకుంటుంది అమ్మా’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ నెల 20న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. చనిపోయాక సుష్మాజీని కూడా అలానే తల్చుకుంటారని చెప్తూ ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన సుష్మా స్వరాజ్ అతనికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. ‘నా గురించి ఇంత అత్యున్నతమైన ఆలోచన చేసినందుకు నీకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. సుష్మా సమాధానం పట్ల నెటిజన్లు ఆనందం వ్యక్తం చేయడమే కాక ఇర్ఫాన్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. Is bhawana ke liye apko mera agrim dhanyawad. I thank you in anticipation for this kind thought. https://t.co/pbuW6R6gcE — Sushma Swaraj (@SushmaSwaraj) July 21, 2019 -
ముగిసిన షీలా దీక్షిత్ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ : గుండెపోటుతో శనివారం కన్నుమూసిన ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాల మధ్య ఆమె పార్థివ దేహానికి ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దివంగత నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు అంతిమ యాత్రకు తరలివచ్చారు. అంతకుముందు షీలా దీక్షిత్ భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. ప్రజల సందర్శనార్ధం ఇక్కడ కొద్దిసేపు ఉంచిన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీ పీసీసీ కార్యాలయానికి భౌతిక కాయాన్ని తరలించారు. యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ బీజేపీ కురువృద్ధులు ఎల్కే అద్వానీ సహా పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు దివంగత నేతకు నివాళులు అర్పించారు. మరోవైపు దివంగత నేతతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోనియా గాంధీ ట్వీట్ చేశారు. ఇక షీలా దీక్షిత్ ఢిల్లీ అభివృద్ధికి విశేషంగా కృషిచేశారని, ఆమె విలువైన మార్గదర్శకత్వాన్ని తాను కోల్పోయానని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. కాగా షీలా దీక్షిత్ గుండెపోటుతో శనివారం ఉదయం ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరగా వైద్యులు తీవ్రంగా శ్రమించినా మరోసారి గుండె పోటు రావడంతో మధ్నాహ్నం 3.55 గంటలకు మరణించిన సంగతి తెలిసిందే. -
షీలా దీక్షిత్‌కు సోనియా, ప్రియాంక నివాళులు
సాక్షి, న్యూఢిల్లీ : గుండెపోటుతో శనివారం కన్నుమూసిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ భౌతిక కాయాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. ప్రజల సందర్శనార్ధం ఇక్కడ కొద్దిసేపు ఉంచిన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో ఆమె పార్ధివ దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో షీలా దీక్షిత్ భౌతిక కాయాన్ని సందర్శించిన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ దివంగత నేతకు నివాళులు అర్పించారు. షీలా దీక్షిత్ ఢిల్లీ అభివృద్ధికి విశేషంగా కృషిచేశారని, ఆమె విలువైన సూచనలను తాను కోల్పోయానని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. కాగా షీలా దీక్షిత్ గుండెపోటుతో శనివారం ఉదయం ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరగా వైద్యులు తీవ్రంగా శ్రమించినా మరోసారి గుండె పోటు రావడంతో మధ్నాహ్నం 3.55 గంటలకు మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే అంత్యక్రియల్లో యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. -
ఢిల్లీ బరిలో షీలా దీక్షిత్
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంతో ఢిల్లీలో ఒంటరిపోరుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్ధానాలకు గాను ఆరు స్ధానాలకు కాంగ్రెస్ తన అభ్యర్ధులను ప్రకటించింది. దేశ రాజధానిలో దిగ్గజ నేతలను ఆ పార్టీ రంగంలోకి దింపింది. ఢిల్లీ మాజీ సీఎం, నగర పార్టీ చీఫ్ షీలా దీక్షిత్‌ను ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీలో నిలిపింది. చాందినీ చౌక్ నుంచి జేపీ అగర్వాల్, తూర్పు ఢిల్లీ నుంచి అరవిందర్ లవ్లీ, న్యూఢిల్లీ నుంచి అజయ్ మాకెన్, రాజేష్ లిలోతియా వాయువ్య ఢిల్లీ, మహబ్‌లాల్ మిశ్రా పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రకటించింది. గట్టి నేతలను బరిలో దింపడం ద్వారా ఆప్, బీజేపీలను దీటుగా ఎదుర్కోవాలని కాంగ్రెస్ కసరత్తు సాగించినట్టు వెల్లడవుతోంది. మరోవైపు ఆప్‌తో పొత్తు కోసం కాంగ్రెస్‌లో కొందరు నేతలు చేసిన ప్రయత్నాలకు పార్టీ ఢిల్లీ చీఫ్ షీలా దీక్షిత్ గండికొట్టారు. కాంగ్రెస్ సొంతంగానే పోటీ చేస్తుందని ఆమె పలుమార్లు స్పష్టం చేశారు. ఇక ఢిల్లీలో 4 లోక్‌సభ స్ధానాలను తాము ఇవ్వజూపినా పొత్తుకు ఆప్ విముఖత చూపిందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేయగా, ఓట్లు చీలి బీజేపీకి లాభం చేకూరేలా కాంగ్రెస్ వైఖరి ఉందని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ సహా పంజాబ్, రాజస్ధాన్ సహా ఇతర ప్రాంతాల్లోనూ పొత్తు ఉండాలని ఆప్ పేర్కొనడంతోనే కాంగ్రెస్ వెనక్కితగ్గినట్టు చెబుతున్నారు. -
మన్మోహన్ కన్నా మోదీనే మేలు : షీలా దీక్షిత్
న్యూఢిల్లీ : ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీకి లాభం చేకూర్చేలా మాట్లాడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్. ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నా మోదీనే మేలంటూ సంచలన వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు షీలా దీక్షిత్. మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఓ ఆంగ్ల మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో షీలా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2008లో 26/11 దాడులు జరిగినప్పుడు ఉగ్రవాద నిర్మూలన కోసం యూపీఏ సరైన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై షీలా స్పందిస్తూ.. ‘అవును ఈ విషయాన్ని నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఉగ్రవాదాన్ని అణిచే విషయంలో మన్మోహన్ కాన్న నరేంద్ర మోదీనే బెటర్. ఐతే రాజకీయ లబ్ధి కోసమే మోదీ పాకిస్తాన్ పట్ల దూకుడుగా వ్యహరిస్తున్నార’ని తెలిపారు. బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా కేంద్రంపై వైమానికదాడులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు షీలా దీక్షిత్. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు బీజేపీ నేతలు. పాకిస్తాన్‌కు ధీటుగా జవాబిచ్చే ధైర్యం ఒక్క మోదీకే ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం షీలా వ్యాఖ్యలను జీర్ణించులేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆత్మరక్షణలో పడ్డారు షీలా దీక్షిత్. మీడియా సంస్థలు తన వ్యాఖ్యలను వక్రీకరించాయని.. తాను మాట్లాడిన సందర్భం వేరే అని స్పష్టం చేశారు షీలా దీక్షిత్. -
'నేను అక్కడ సీఎం అభ్యర్థినా.. నో థ్యాంక్స్'
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను బరిలోకి దించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలు చేసింది. అయితే, ఈ ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, బ్రాహ్మణ వర్గానికి చెందిన షీలాను సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించి లబ్ధి పొందాలని ఆలోచనలు చేసింది. అందులో భాగంగానే గత వారం సోనియాగాంధీ ఆమెతో భేటీ అయి ఈ విషయం చర్చించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ పగ్గాలు తీసుకోవడమో లేదా.. ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థిగా ఉండటమో రెండిట్లో ఏదో ఒకటి చేయాలని సోనియా ప్రతిపాదించగా తాను ఉత్తరప్రదేశ్ విషయంలో మాత్రం ఆ సాహసం చేయలేనని చెప్పినట్లు తెలుస్తోంది. తన పార్టీ వర్గాలతో కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను ఉండలేనని, అసలు ఆలోచనే లేదని చెప్పారంట. కాగా, ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా దింపాలనే ఆలోచన చేసింది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అట.