సాక్షి, న్యూఢిల్లీ : గుండెపోటుతో శనివారం కన్నుమూసిన ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాల మధ్య ఆమె పార్థివ దేహానికి ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దివంగత నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు అంతిమ యాత్రకు తరలివచ్చారు.
అంతకుముందు షీలా దీక్షిత్ భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. ప్రజల సందర్శనార్ధం ఇక్కడ కొద్దిసేపు ఉంచిన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీ పీసీసీ కార్యాలయానికి భౌతిక కాయాన్ని తరలించారు. యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ బీజేపీ కురువృద్ధులు ఎల్‌కే అద్వానీ సహా పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు దివంగత నేతకు నివాళులు అర్పించారు. మరోవైపు దివంగత నేతతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోనియా గాంధీ ట్వీట్ చేశారు.
ఇక షీలా దీక్షిత్ ఢిల్లీ అభివృద్ధికి విశేషంగా కృషిచేశారని, ఆమె విలువైన మార్గదర్శకత్వాన్ని తాను కోల్పోయానని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. కాగా షీలా దీక్షిత్ గుండెపోటుతో శనివారం ఉదయం ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరగా వైద్యులు తీవ్రంగా శ్రమించినా మరోసారి గుండె పోటు రావడంతో మధ్నాహ్నం 3.55 గంటలకు మరణించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment