బెంగళూర్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నిష్క్రమణ దశలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప చేపట్టిన పరివర్తన యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం ప్యాలెస్ గ్రౌండ్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కాంగ్రెస్ పాలన తెరపడుతోందనేందుకు ర్యాలీకి భారీగా హాజరైన ప్రజలే సంకేతమన్నారు. ప్రజా సంక్షేమానికి కేంద్రం కేటాయించిన నిధులను కాంగ్రెస్ పార్టీ తన సంక్షేమానికి వాడుకుంటోందని ఆరోపించారు. 2014 నుంచి కర్ణాటకకు కేంద్రం కేటాయించిన నిధుల వివరాలను ప్రధాని వివరించారు.
కర్ణాటక అభివృద్ధికి ఉపయోగించాల్సిన నిధులను సీఎం సిద్ధరామయ్య దారిమళ్లించారని విమర్శించారు. ఈ విషయాలపై ప్రజలు దృష్టిసారించాలని కోరారు. కేంద్ర బడ్జెట్‌లో బెంగళూర్ మెట్రోకు రూ 17,000 కోట్లు కేటాయించామని..దీని ద్వారా 15 లక్షల మంది నగర ప్రయాణీకులకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ఆపరేషన్ గ్రీన్‌ను చేపట్టామని..ఇది డైరీ రైతులకు అమూల్ తరహాలో మెరుగైన ప్రయోజనాలు అందిస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment