యుగపురుషుడు, అర్జునుడు రాహులేనట!
అలహాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం అర్జునావతారంలో దర్శనమిచ్చారు. అది కూడా ఓ ఫ్లెక్సీలో.. మరో మూడు రోజుల్లో అహ్మదాబాద్లో రాహుల్ గాంధీ మహా రోడ్ షో ఉన్న నేపథ్యంలో ఆయన కోసం ఏర్పాటుచేసిన ఇలాంటి ఫ్లెక్సీలు కాస్తంత వివాదానికి దారి తీశాయి. రాహుల్ కు స్వాగతం పలుకుతూ ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీల్లో నాయకులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. రాహుల్ ను మహాభారతంలోని అర్జునుడి అవతారంతో పోలుస్తూ యుగపురుషుడిగా అభివర్ణిస్తూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అందులో రాహుల్ ను భాణం ఎక్కుపెట్టిన అర్జునుడిగా చిత్రిస్తూ దానిని జనరద్దీ ఉన్న ప్రాంతాల్లో పెట్టారు. దీనిపై పలుచోట్ల విమర్శలు కూడా వస్తున్నాయి.
కిసాన్ యాత్రలో భాగంగా గురువారం అలహాబాద్ లో ప్రచారం చేసేందుకు రాహుల్ వస్తున్న నేపథ్యంలో ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీలో ఒక్క ఆయనది మాత్రమే కాకుండా.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కూతురు ప్రియాంక గాంధీ, ఉత్తప్రదేవ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రాజ్ బబ్బార్, రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ ఇతర కాంగ్రెస్ పార్టీ నేతల ఫొటోలు ఉన్నాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పోస్టర్ల గురించి అక్కడి కాంగ్రెస్ నేతలకే తెలియదంట. దీనిపై స్పందించేందుకు కూడా వారు నిరాకరించారు. ఓ సీనియర్ నేత మాత్రం దీనిపై స్పందిస్తూ తాము రాహుల్ రోడ్ షో గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నామని, ప్రస్తుతానికి అలాంటి పోస్టర్ల గురించి చర్చించి విలువైన సమయాన్ని వృధా చేసుకోబోమంటూ వ్యాఖ్యానించారు.