'గిరిజన శాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే'
ముంబై: మహారాష్ట్ర గిరిజన శాఖ మంత్రికి పోషకాహారలోపం సెగ తగిలింది. శుక్రవారం ప్రతిపక్ష కాంగ్రెస్.. మంత్రి విష్ణు సవరా రాజినామా చేయాలని డిమాండ్ చేసింది. ఇటీవల పాల్గర్ జిల్లాలో పోషకాహార లోపంతో మృతి చెందిన రెండేళ్ల బాలుడి వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మంత్రి సవరా కు చేదు అనుభవం ఎదురైంది. ఆ ప్రాంతంలో సుమారు 600 మంది బాలలు పోషకాహారలోపంతో మరణించారని తెలుపుతూ స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
గిరిజన బాలల మృతికి నైతిక బాధ్యత వహిస్తూ గిరిజన శాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నేత విఖే పాటిల్ డిమాండ్ చేశారు. గిరిజన శాఖ మంత్రి రాజీనామాకు ఒప్పుకోని పక్షంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.