సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలను ఉద్దేశించి సైనిక దళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇంతకు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటీ ? విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ‘ప్రజలను తప్పుదోవ పట్టించేవారు ఎప్పటికి నాయకులు కాలేరు’ అని పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనల గురించి రావత్ గురువారం నాడు ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ‘మన నగరాల్లో, పట్టణాల్లో ప్రజలు విధ్వంసకాండకు పాల్పడేలా కళాశాలలు, యూనివర్శిటీల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. అది ఎప్పటికీ నాయకత్వం అనిపించుకోదు’ అని కూడా ఆయన విపులీకరించారు.
ఈ విధంగా రాజకీయాలకు సంబంధించి ఓ సైనికాధికారి వ్యాఖ్యలు చేయడం సైనిక సర్వీసు నిబంధనలకు పూర్తి విరుద్ధం. సైనిక సర్వీసు నిబంధనల్లోని 21వ నిబంధన ప్రకారం ‘ఓ రాజకీయ పార్టీ నిర్వహించే ఎలాంటి ప్రదర్శనల్లో కూడా సైనికులు పాల్గొనకూడదు. అలాగే ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ రాజకీయాలకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలను చేయరాదు’. ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రతిపక్షాలు రావత్‌పై దుమారం రేపుతున్నాయి. (సీఏఏ ఆందోళనలపై ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్య)
ఎప్పుడు సైనిక క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ, భారతీయ సైనికుల క్రమశిక్షణ అతి గొప్పదంటూ ప్రశంసించే రావత్ ఈ వ్యాఖ్యలు చేయడం ఏమిటని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సైనికులు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల పాకిస్తాన్ తరహాలో ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోయి సైనిక నియంత్రణ పాలన వచ్చే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతోనే భారత సైనిక సర్వీసు రూల్స్‌లో ఈ నిబంధనను చేర్చారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా సైనిక సర్వీసు రూల్స్ తెలియజేస్తున్నాయి. సైనిక అత్యున్నత అధికారే నిబంధనలు ఉల్లంఘిస్తే చర్య తీసుకునే ప్రజాస్వామ్య పరిణత మన వ్యవస్థలో ఉండే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment