‘దేశం ఇప్పటికే క్యాష్ లెస్ అయింది’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ క్యా‘ష్ లెస్’ డ్రీమ్ పై కాంగ్రెస్ వాగ్బాణాలు ఎక్కుపెట్టింది. నగదు రహిత లావాదేవీల దిశగా ముందుకెళ్లాలన్న మోదీ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేసింది. మోదీ సర్కారు అనాలోచితంగా పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో దేశం ఇప్పటికే ’నగదు రహితం’గా మారిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ వ్యంగ్యంగా అన్నారు. ముందస్తు సన్నాహాలు, సంస్థాగత కసరత్తు చేయకుండా పెద్ద నోట్లను రద్దు చేశారని విమర్శించారు. సామాన్యులను కష్టాలకు గురిచేసి దేశాన్ని నగదు రహితంగా మారుస్తారా అని ప్రశ్నించారు.
‘నోట్ల కష్టాలు లేకుండా ముందు సన్నాహాలు చేయండి. దేశంలో 70 శాతం మంది ప్రజలు నెలకు 10 వేల రూపాయల సంపాదనతో బతుకుతున్నారు. వీరు తమ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసుకోలేరు. వీళ్లంతా ఏం చేయాలి? ప్రజలు నగదు కోసం 20 కిలోమీటర్ల వరకు వెళ్లాల్సి వస్తోంది. పాత పెద్ద నోట్ల రద్దుతో ప్రజల దగ్గర డబ్బు లేకపోవడంతో దేశం ఇప్పటికే నగదు రహితంగా మారింద’ని సిబల్ వ్యాఖ్యానించారు.