అక్టోబర్ 25న తేలనున్న స్పెక్ట్రమ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీః 2జీ స్పెక్ట్రం కేసులు ఎట్టకేలకు కొలిక్కివచ్చాయి. ఈ కేసుల్లో తుది విచారణను సీబీఐ కోర్టు అక్టోబర్ 25న చేపట్టనుంది. స్పెక్ట్రం కేటాయింపుల కేసులో మాజీ టెలికాం మంత్రి ఏ రాజా, డీఎంకే రాజ్యసభ సభ్యులు కనిమొళి ఇతరులు నిందితులుగా ఉన్నారు. కేసులో సమర్పించిన పత్రాలు భారీగా ఉండటం, సాంకేతిక అంశాలతో ముడిపడిన క్రమంలో వీటిని ఇంకా పరిశీలించాల్సి ఉందని విచారణను వాయిదా వేస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ పేర్కొన్నారు.
తదుపరి విచారణ సందర్భంగా తీర్పును ఎప్పుడు వెలువరించేదీ వెల్లడిస్తామని చెప్పారు. స్పెక్ర్టం కేసులకు సంబంధించి రెండు వేర్వేరు కేసులను కోర్టు విచారిస్తుంది. వీటిలో ఒక కేసును సీబీఐ, మరో కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు నిర్వహించాయి. ఏప్రిల్ 26న కోర్టులో ఈ కేసులపై తుది వాదనలు ముగిశాయి. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో మాజీ మంత్రి రాజా కొన్ని టెలికాం సంస్థల పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపిస్తోంది.