మూడు చోట్ల మళ్లీ కర్ఫ్యూ
శ్రీనగర్: కశ్మీర్ లోయలోని మూడు ప్రాంతాల్లో గురువారం కర్ఫ్యూ విధించారు. వేర్పాటువాదులు సెప్టెంబర్ 8 వరకు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శ్రీనగర్ పట్టణంలోని నౌహాట్ట, ఎమ్ఆర్ గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలతో పాటు బారాముల్లాలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
అధికారులు కర్ఫ్యూను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బుధవారం బారాముల్లా జిల్లాలోని రఫియాబాద్ ప్రాంతంలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లలో డానిష్ అహ్మద్ అనే 18 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో మళ్లీ లోయలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో అధికారులు కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.