
అక్కడ రావణుడిని పూజిస్తారు..
కాన్పూర్: చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి చేసుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. పురాణాల ప్రకారం విజయదశమి పండుగ వెనుక విభిన్న కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో రాక్షసరాజు రావణ సంహారం కూడా ఒకటి. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో విజయదశమి రోజున రావణుడి దిష్టిబొమ్మను టపాసులతో దహనం చేయడం ఆచారంగా వస్తోంది. అలాంటిది దేశంలోని ఓ ప్రాంతంలో రావణుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఏటా దసరా పర్వదినాన రావణుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఉన్న రావణుడి ఆలయం 'దశానన్'లో దసరా రోజున దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. అక్కడి ప్రజలు రావణుడిని శక్తి స్వరూపంగా విశ్వసిస్తారు. 147 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి తమ మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అయితే అదంతా కేవలం దసరా పర్వదినానే.. ఎందుకంటే ఏడాది పొడవునా మూసి ఉండే రావణ ఆలయాన్ని కేవలం దసరా రోజునే తెరుస్తారు. రోజంతా పూజలందుకున్న రావణుడి బొమ్మని దహనం చేశాక ఆలయ ద్వారాలు మూతపడతాయి. తిరిగి మరుసటి ఏడాది దసరా నాటికే అపర శివభక్తుడైన రావణుడి దర్శనం.