
మణిపూర్ బంద్‌లో హింస
భూ సంస్కరణలు, వాణిజ్యానికి సంబంధించిన వివాదాస్పద బిల్లులను అసెంబ్లీ ఆమోదించడాన్ని నిరసిస్తూ మణిపూర్‌లో గిరిజన విద్యార్థి సంఘాలు పిలుపు ఇచ్చిన బంద్ హింసాత్మకంగా మారింది.
8 మంది మృతి, 31 మందికి గాయాలు
ఇంఫాల్: భూ సంస్కరణలు, వాణిజ్యానికి సంబంధించిన వివాదాస్పద బిల్లులను అసెంబ్లీ ఆమోదించడాన్ని నిరసిస్తూ మణిపూర్‌లో గిరిజన విద్యార్థి సంఘాలు పిలుపు ఇచ్చిన బంద్ హింసాత్మకంగా మారింది. చురచాంద్‌పూర్ పట్టణంలో జరిగిన ఆందోళనల్లో ఎనిమిది మంది మృతి చెందగా.. 31 మందికిపైగా గాయపడ్డారు. కర్ఫ్యూ ఉన్నా ఆందోళనకారులు.. రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. బిల్లుల ఆమోదంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ గిరిజన విద్యార్థి సంఘాలు చురచాంద్‌పూర్‌లో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి.
పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసి, నిప్పు పెట్టాయి. దీంతో సోమవారం సాయంత్రం నుంచే ఇక్కడ కర్ఫ్యూ విధించారు. అయినా మంగళవారం కూడా ఆందోళనలు, దాడులు, పోలీసు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే మంగా వైపే నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో అక్కడ ఒక కాలిపోయిన మృతదేహాన్ని, మరో చోట మరో మృతదేహాన్ని గుర్తించారు.