సుఖోయ్ యుద్ధ విమానంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్
జోధ్‌పూర్: రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(57) బుధవారం రెండు సీటర్ల సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధవిమానంలో ప్రయాణించారు. ఆలివ్ రంగు యాంటీ గ్రావిటీ సూట్ ధరించిన సీతారామన్.. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో ఐఏఎఫ్ పైలెట్‌తో కలిసి 45 నిమిషాల సేపు ఆకాశంలో విహరించారు. దీంతో సుఖోయ్‌లో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ మంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. సుఖోయ్‌లో ప్రయాణించిన తర్వాత సీతారామన్ మాట్లాడుతూ ఈ ప్రయాణం చిరస్మరణీయమైన అనుభవమని వ్యాఖ్యానించారు. ఈ ప్రయాణానికి ముందు ఐఏఎఫ్ ఎయిర్‌బేస్ నిర్వహణ, యుద్ధ సన్నద్ధతపై ఆమె సమీక్ష నిర్వహించారు.
అనంతరం సుఖోయ్ ప్రయాణంతో పాటు కాక్‌పిట్ పరిస్థితులపై అధికారులు మంత్రికి వివరించారు. సీతారామన్ కంటే ముందు మాజీ రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలామ్ 2003లో, ప్రతిభా పాటిల్ 2009లో సుఖోయ్‌లో ప్రయాణించారు. సీతారామన్ కంటే ముందు 2003లో అప్పటి రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ సుఖోయ్–30 విమానంలో చక్కర్లు కొట్టారు. రక్షణమంత్రి ప్రయాణించిన విమానం 8 వేల మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ ధ్వని వేగాన్ని అధిగమించిందని ఓ ఐఏఎఫ్ అధికారి తెలిపారు. ‘ ఈ ప్రయాణంలో ఎవరెస్ట్ శిఖరమంత(8,848 మీటర్ల) ఎత్తుకు చేరుకోవడంతో పాటు ధ్వని వేగాన్ని అధిగమించడం మన పైలెట్లకున్న సామర్థ్యాన్ని తెలియజేస్తోంది’ అని సీతారామన్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment