6 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఐజీఐ ఎయిర్‌పోర్టును కప్పేసిన పొగమంచు
భారీస్థాయిలో విమానాల రద్దు, దారి మళ్లింపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. పగటి ఉష్ణోగ్రతలు 16 నుంచి 6 డి గ్రీలకు చేరుకోవడం, దీనికితోడు పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర య్యాయి. గడచిన 8 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పొగమంచు కమ్మేయడంతో అన్ని ప్రజా రవాణా సాధనాలకు తీవ్ర అంతరాయాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా పొగమంచు ప్రభావం విమాన, రైళ్ల రాకపోకలపై తీవ్రంగా పడింది. దీని కారణంగా స్థానిక ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 600లకు పైగా విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వందల సంఖ్యలో ప్రయాణికులు అగచాట్లు పడ్డారు. ఐజీఐ విమానాశ్రయాన్ని ఇంతటి భారీస్థాయిలో పొగమంచు కప్పేయడం గడచిన 8 ఏళ్లలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు పొగమంచు రన్‌వేను కప్పేసిందని దీంతో ఢిల్లీ నుంచి బయల్దేరాల్సిన 140 విమానాలను రద్దు చేశామని, 52 విమానాలను దారి మళ్లించామని, 463 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఇండిగో విమానాన్ని అహ్మదాబాద్‌కు, హాంకాంగ్ నుంచి ఢిల్లీ చేరాల్సిన రెండు క్యాథే పసిఫిక్ విమానాలను హైదరాబాద్‌కు మళ్లించినట్టు పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి పలు ప్రాంతాల కు వెళ్లాల్సిన విమానాలు 2 నుంచి 3 గంటలు ఆలస్యంగా బయలుదేరాయన్నారు. కొన్నింటిని పూర్తిగా రద్దు చేసినట్టు అధికారులు వివరించారు.
రైళ్లకూ తీవ్ర అంతరాయం
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు రైలు ప్రయాణికులను సైతం ముప్పుతిప్పలు పెట్టింది. దట్టంగా అలముకున్న పొగమంచుతో ట్రాక్ కనిపించని కారణంగా అన్ని ప్రధాన రైళ్లను గంటలకొద్దీ ఆలస్యంగా నడిపినట్టు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ నుంచి బయల్దేరే రైళ్లు, వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి చేరాల్సిన రైళ్లు 2 నుంచి 4 గంటల ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ రావాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ సహా తమిళనాడు తదితర ముఖ్యమైన రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు.
మంచు దుప్పట్లో హస్తిన
Published Tue, Jan 7 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
Advertisement
Advertisement