ఢిల్లీనే నెంబర్.1
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరం అన్ని నగరాలను పక్కకుతోసి టాప్లో నిలిచింది. ఎందులో అనుకుంటున్నారా... దేశంలోని కాలుష్య నగరాల్లో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఎమ్బీఎంటీ వాయు కాలుష్య, ప్రజారోగ్య శాఖ ఇటీవల జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీలో సగటున సెకనుకు 10 మైక్రోమీటర్ల సాంధ్రతతో గాలి కలుషితమవుతోంది. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
2014 లో ఎమ్బీఎంటీ వాయు కాలుష్య, ప్రజారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... ఉత్తర భారత దేశంలోని కాలుష్య నగరాల్లో ఢిల్లీ (పిఎం 10), జార్ఖండ్(సల్ఫర్ డయోడ్), పశ్చిమబెంగాల్ (నైట్రోజన్ డయాక్సైడ్ ఎక్కువ)లు ప్రథమస్థానాల్లో ఉన్నాయి. పిహెచ్ఎఫ్ఐ పరిశోధనల ప్రకారం...ఇప్పటివరకు ఢిల్లీలో 2004 సంవత్సరంలో అతి తక్కువ వాతావరణ కాలుష్యం నమోదైంది. అప్పటినుంచి ఇప్పటివరకు వాహనకాలుష్యాన్ని నివారించే ప్రత్యామ్నాయాల అన్వేషణలో ఢిల్లీ వాయుకాలుష్య శాఖ విఫలమైంది. అంతేకాకుండా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు కూడా వాయు కాలుష్యానికి మరో కారణంగా చెప్పవచ్చు.
వాయు కాలుష్యంవల్ల పిల్లల్లో ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయి. దీనివల్ల ఆస్తమా , ఊపిరితిత్తుల వ్యాధులు సోకే ప్రమాదం ఉందని ప్రముఖ వైద్యశాస్త్ర నిపుణులు డాక్టర్ కృష్ణ తెలిపారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఆరోగ్యశాఖ వాయు కాలుష్య నివారణ చర్యలు చేపట్టింది. ఇటీవల 170 దేశాల్లో నిర్వహించిన వాయు కాలుష్య సూచీ పరిశోధనల ప్రకారం...చైనా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్లను వెనక్కినెట్టి భారత్ ప్రథమస్థానంలో నిలిచింది. ఈ సమస్యపై మసాచుసెట్స్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మైకేల్ గ్రీన్ స్టన్ వెల్లడించిన వివరాల ప్రకారం...భారత్, చైనా మరికొన్ని దేశాల్లోని ప్రజలు వాయు కాలుష్యానికి ఎక్కువగా గురి అవుతున్నట్లు వెల్లడైంది.