ఆరోగ్యం బాగోలేదు గానీ.. ప్రచారంలో దూకుతారా?
రాజకీయ నాయకులకు పదవిలో ఉన్నా.. ఎన్నికలు వస్తున్నాయన్నా ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అదే కోర్టులు, అరెస్టులు అనేసరికి మాత్రం ఉన్నట్టుండి ఆస్పత్రిలో చేరిపోతారు. హర్యానాకు చెందిన కురువృద్ధ నాయకుడు ఓం ప్రకాష్ చౌతాలా (79) విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఆ రాష్ట్రంలో వచ్చేవారం ఎన్నికలు ఉండటంతో ఆయన ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. చురుగ్గా తిరుగుతున్నారు. అయితే, మరోవైపు ఆరోగ్యం బాగోలేదంటూ బెయిల్ ఇప్పించాలని కోర్టును కోరారు. దాంతో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు ఆగ్రహం వచ్చింది. మేదాంత మెడిసిటీ ఆస్పత్రి నుంచి అసలు బయటకు ఎందుకు వెళ్లారో వివరించాలని ఢిల్లీ హైకోర్టు ఆయనను ఆదేశించింది.
1999 నాటి టీచర్ల నియామకంలో అవినీతి కేసులో చౌతాలాకు పదేళ్ల జైలుశిక్ష పడింది. ఆయన ప్రస్తుతం బెయిల్ మీద విడుదలై ప్రచారం చేసుకుంటున్నారు. దాంతో, బెయిల్ రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టును సీబీఐ కోరింది. దాంతో.. ఆయన అంతలా రాజకీయ సమావేశాల్లో పాల్గొంటుంటే, సీబీఐ ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని సీబీఐని జడ్జి ప్రశ్నించారు. తాము ప్రయత్నించాము గానీ... ఒకసారి ఆయన పొగరు చూడాలని సీబీఐ తరఫు న్యాయవాది అన్నారు. చౌతాలా తమ వద్దకు సీబీఐ కస్టడీలో రాలేదని, మామూలు పేషెంటుగానే వచ్చారని, అలా వచ్చినవాళ్లు వెళ్లిపోతామంటే తాము బలవంతంగా అట్టిపెట్టుకోలేమని మేదాంత మెడిసిటీ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ నరేష్ ట్రెహాన్ చెప్పారు.