Om Prakash Chautala
-
థర్డ్ ఫ్రంట్ ప్రశ్నే లేదు
ఫతేబాద్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించడానికి కాంగ్రెస్ పార్టీతో కూడిన కొత్త కూటమి ఏర్పాటు కావాలని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నాయకుడు నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ఐక్య కూటమి బరిలోకి దిగాల్సిన అవసరముందన్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అనే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. బీజేపీని ఓడించడం కాంగ్రెస్‌తో కూడిన కూటమితోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. దివంగత ఉప ప్రధానమంత్రి దేవీలాల్ జయంతి సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) ఆధ్వర్యంలో ఆదివారం హరియాణాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. నితీశ్‌తోపాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఐఎన్ఎల్డీ నేత ఓంప్రకాశ్ చౌతాలా, శిరోమణి అకాలీదళ్ నాయకుడు సుఖ్బీర్సింగ్ బాదల్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన నాయకుడు అరవింద్ సావంత్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ నేతలెవరూ పాల్గొనలేదు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ సీఎంలు మమతా బెనర్జీ, కేసీఆర్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా దూరంగా ఉండడం గమనార్హం. కేంద్రంలో మార్పు జరిగితేనే.. రాజకీయ లబ్ధి కోసం హిందూ, ముస్లిం అంటూ ప్రజలను బీజేపీపై విభజిస్తోందని నేతలు నిప్పులు చెరిగారు. తప్పుడు హామీలిస్తూ మభ్యపెడుతోందని విమర్శించారు. జీవనోపాధి లేక రైతులు, యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే పరిష్కార మార్గమన్నారు. కేంద్రంలో మార్పు జరిగితేనే రైతన్నలు, నిరుద్యోగ యువత జీవితాలు బాగుపడతాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. మెయిన్ ఫ్రంట్ కావాలి దేశాన్ని సరైన దిశలో నడిపించలేకపోతున్న మేనేజర్(ప్రధానమంత్రి)ని మార్చేయాలని ఏచూరి అన్నారు. కాంగ్రెస్‌తో సహా విపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావాలన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు లేకుండా విపక్ష ఫ్రంట్ అసాధ్యమని నితీశ్ తేల్చిచెప్పారు. సమస్యలను వదిలి బీజేపీ ముస్లిం, పాకిస్తాన్, మందిర్, మసీద్ జపం చేస్తోందని తేజస్వీ ధ్వజమెత్తారు. ఇప్పుడు ఎన్డీయే ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ అంటే బడా ఝూటా పార్టీ అని ఎద్దేవా చేశారు. బహిరంగ సభ అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి పదవికి తాను పోటీ పడడం లేదని చెప్పారు. -
25న హరియాణాకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా సన్నాహలు ముమ్మరం చేసిన టీఆర్ ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 25న హరియాణా పర్యటనకు వెళ్లనున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉపప్రధాని చౌధరి దేవీలాల్ 108వ జయంతి సందర్భంగా ఈ నెల 25న హరియాణాలో జరగనున్న సమ్మాన్ దివస్‌లో కేసీఆర్ పాల్గొననున్నారు. దేవీలాల్ కుమారుడు, హరియాణా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) అధినేత ఓంప్రకాశ్ చౌతాలా ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పంపినట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ మినహా దేశంలోని వివిధ విపక్ష రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోపాటు కేసీఆర్ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. ఫతేబాద్ లో నిర్వహించే ఈ కార్యక్రమం విపక్షాల ఐక్యతను చాటేందుకు వేదికగా నిలుస్తుందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. జాతీయ పార్టీ స్థాపన కోసం సన్నాహాలు చేస్తున్న కేసీ ఆర్.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీయే తర పార్టీలతో సత్సంబంధాలు కొనసాగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేప థ్యంలో హరియాణాలో జరిగే దేవీలాల్ జ యంతి వేడుకలకు హాజరు కావాలని నిర్ణ యించుకున్నారు. ఇటీవలి కాలంలో బిహార్ సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌తో సమావేశమైన కేసీఆర్.. కర్ణాటక మాజీ సీఎం, జెడీఎస్ అధినేత కుమారస్వామి, గుజరాత్ మాజీ సీఎం శంకర్‌సిన్హ్ వాఘేలాతోనూ భేటీ అయ్యారు. హరియాణా పర్యటనలో భాగంగా అక్కడి రైతు, దళిత సంఘాల ప్రతినిధులతోనూ కేసీఆర్ భేటీ అయ్యే అవకాశముంది. సీఎం పర్యటనకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
హరియాణా మాజీ ముఖ్యమంత్రికి షాక్! నాలుగేళ్ల జైలుశిక్ష
సాక్షి, న్యూఢిల్లీ: అక్రమ ఆస్తుల కేసులో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా(86)కు ఢిల్లీ న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.50 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించింది. అధికారులు ఆయన్ను శుక్రవారం తిహార్ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రెండో నంబర్ జైలులో మరో ఇద్దరితో కలిపి ఆయనకు గదిని కేటాయిస్తామని అధికారులు తెలిపారు. 1993–2006 మధ్య కాలంలో ఆయన ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధూల్ గత వారమే చౌతాలాను దోషిగా నిర్ధారించారు. చౌతాలా ఆస్తుల్ని కూడా జప్తు చేయాలని ఆదేశించారు. 2005లో చౌతాలాపై కేసు నమోదు చేసిన సీబీఐ 2010 మార్చి 26న చార్జిషీటు దాఖలు చేసింది. హరియాణా సీఎంగా ఉన్న కాలంలో చౌతాలా తన పేరుతో, కుటుంబ సభ్యుల పేర్లతో భారీగా స్థిర, చరాస్తులెన్నిటినో కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆయన వాస్తవంగా చూపిన ఆదాయం కంటే 189.11% ఎక్కువగా, అంటే రూ.6.09 కోట్ల ఆస్తుల్ని సమకూర్చుకున్నారని, ఇందుకు తగిన ఆధారాలను చూపలేకపోయారని సీబీఐ పేర్కొంది. -
Om Prakash Chautala: మాజీ సీఎం మళ్లీ దోషిగా..
ఢిల్లీ: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా మరో కేసులో దోషిగా తేలారు. టీచర్ల కుంభకోణంలో ఆయన దోషిగా నిరూపితమై, పదేళ్ల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే ఉంటుంది. పైగా జైలు శిక్ష పూర్తి చేసుకుని గతేడాది జులైలో ఆయన విడుదలయ్యారు. తాజా కేసు విషయానికి వస్తే.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన ఆరోపణలపై చౌతాలాపై గతంలోనే కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విచారణను చేపట్టిన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు శనివారం చౌతాలాను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆయనకు ఏ తరహా శిక్ష విధించాలన్న విషయంపై కోర్టు ఈ నెల 26న చేపట్టనున్న విచారణలో నిర్ణయం తీసుకోనుంది. పదేళ్ల జైలు శిక్ష అనుభవించి వచ్చి ఏడాది కాకముందే మరో కేసులో దోషిగా తేలిన 87 ఏళ్ల చౌతాలాకు.. ఈ సారి ఏ తరహా శిక్ష పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
పదో తరగతి పాసయిన మాజీ సీఎం.. దాంతోపాటు ఇంటర్ కూడా
ఛండీగఢ్: ఆయన ఒకప్పుడు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన ఆ నాయకుడు 86 ఏళ్ల వయసులో పదో తరగతి పాసయ్యాడు. ఒక్క సబ్జెక్ట్‌తో ఆయన పదో తరగతి అర్ధంతరంగా ఆపేసిన ఆయన ఇప్పుడు ఆ సబ్జెక్ట్‌లో ఇప్పుడు పాసయ్యాడు. దీంతో ఆయన పదో తరగతి గండాన్ని గట్టెక్కాడు. ఆయనే హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతలా. తాజాగా శనివారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో ఆయన ఉత్తీర్ణత సాధించాడు. చౌతలా ఇటీవల 12వ తరగతి పాసయ్యాడు. అయితే ఆయన పదో తరగతి పాస్ కాకపోవడంతో ఆ ఉత్తీర్ణతను నిలిపివేశారు. ఆయన ఇంగ్లీశ్ సబ్జెక్ట్‌తో పదో తరగతి చదువు ఆగిపోయింది. ఇటీవల జరిగిన పరీక్షల్లో చౌతలా ఇంగ్లీశ్ పరీక్ష రాశాడు. తాజాగా హరియాణా విద్యా బోర్డు విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో ఆయన ఇంగ్లీశ్ 100కు 88 మార్కులు సాధించి పదో తరగతి గండాన్ని దాటేశాడు. కరోనా తొలి దశలో ఓపెన్ స్కూల్లో చౌతలా ఇంటర్మీడియట్లో చేరారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు రాయకుండానే ఓపెన్ విద్యార్థులంతా పాసయ్యారు. ఆ క్రమంలో చౌతలా కూడా పాసయ్యాడు. అయితే పది పూర్తి చేయకుండానే ఇంటర్‌కు ఉత్తీర్ణత ఇవ్వడం కుదరకపోవడంతో అధికారులు ఫలితాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఓం ప్రకాశ్ చౌతలా పదో తరగతి పాసవడంతో ఇంటర్ కూడా ఉత్తీర్ణత సాధించాడు. లేటు వయసులో లేటెస్ట్గా పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించడం విశేషం. -
వెంటాడిన దురదృష్టం: వీళ్లకు సీఎం పదవి మూణ్ణాళ్ల ముచ్చటే!
వెబ్‌డెస్క్: కాలం కలిసొచ్చినా.. దురదృష్టం వెక్కిరించింది అన్నట్లు... కథ అడ్డం తిరిగి ఎంపీ తీరత్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవి మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. పార్టీలో చెలరేగిన సంక్షోభం కారణంగా సీఎంగా అవకాశం పొందిన ఆయన.. కడదాకా పదవిని నిలబెట్టుకోలేకపోయారు. ఓ వైపు కరోనా ఉధృతి.. మరోవైపు మహిళల వస్త్రధారణ, ఉచిత రేషన్ కావాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలి అనడం వంటి వివాదాస్పద వ్యాఖ్యలతో అధిష్టానాన్ని ఇబ్బందులుకు గురిచేసి చేజేతులా పీఠాన్ని చేజార్చుకున్నారు. ఆర్నెళ్ల కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండటం... ఉప ఎన్నిక నిర్వహించలేని పరిస్థితి కారణంగానే ఆయనను కుర్చీ నుంచి దింపుతున్నారనుకున్నా.. పెద్దలు తలచుకుంటే ఆయనతో రాజీనామా చేయించి.. మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టవచ్చు. కానీ అలా జరగలేదు. ఏదేమైనా 115 రోజుల పాటు సీఎంగా ఉన్న వ్యక్తిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు తీరత్ సింగ్. ఈ నేపథ్యంలో అతితక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాజకీయ నాయకుల గురించి కొన్ని వివరాలు... దేవేంద్ర ఫడ్నవిస్- మహారాష్ట్ర బీజేపీ- శివసేన మధ్య సయోధ్య కుదరకపోవడంతో దేవేంద్ర ఫడ్నవిస్ మూడు రోజులకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో సీఎం పీఠం అధిరోహించిన ఆయన.. శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ మహా కూటమిగా ఏర్పడటంతో రెండోసారి పూర్తిస్థాయి సీఎంగా పనిచేయాలన్న ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఆయన ముఖ్యమంత్రి పదవి అచ్చంగా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. బీఎస్ యడియూరప్ప- కర్ణాటక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2018, మేలో బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. అయితే, అప్పటికే జేడీఎస్- కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడటం, విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో విశ్వాస తీర్మానం ఎదుర్కోవడానికి ముందే తన పదవికి రాజీనామా చేశారు. మే 17న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన 19న సీఎంగా వైదొలిగారు. జగదాంబికా పాల్- ఉత్తరప్రదేశ్ 1998లో ఫిబ్రవరి 21-23 నుంచి మూడు రోజుల పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు జగదాంబికా పాల్. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం రద్దు కాగానే.. రాత్రికి రాత్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కళ్యాణ్‌సింగ్ తిరిగి సీఎంగా నియమితులు కాగానే జగదాంబికా పాల్ తన పదవికి రాజీనామా చేశారు. హరీశ్ రావత్- ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కేవలం ఒకే ఒక్క రోజు సీఎం(రెండో దఫా)గా ఉన్నారు హరీశ్ రావత్. భారత రాజకీయ చరిత్రలో ఇలా ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయనే. ఓం ప్రకాశ్ చౌతాలా- హర్యానా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నేత ఓం ప్రకాశ్ చౌతాలా... 1989- 2004 మధ్య 4సార్లు హర్యానా సీఎంగా పనిచేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల 1990 జూలై 12 నుంచి జూలై 17 వరకు కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే సీఎంగా ఉన్నారు. అదే విధంగా... మూడోసారి పదవి చేపట్టిన ఆయన 17 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. నితీశ్ కుమార్- బిహార్ జనతా దళ్ నేత నితీశ్ కుమార్ 2000 సంవత్సరంలో మార్చి 3 నుంచి మార్చి 10 వరకు కేవలం 8 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. -
పదేళ్ల తర్వాత తీహార్ జైలు నుంచి మాజీ సీఎం విడుదల
చండీగఢ్: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో చౌతాలా పదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2000 సంవత్సరంలో 3,206 మంది జూనియర్ ఉపాధ్యాయులను అక్రమంగా నియమించిన కేసులో చౌతాలా, అతని కుమారుడు అజయ్ చౌతాలా, ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ సహా 53 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2013లో చౌతాలా అరెస్టయ్యారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ప్రభుత్వం జైళ్లలో రద్దీని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పదేళ్ల జైలు శిక్షలో కనీసం తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్ష కాలం పూర్తి చేసిన వారికి 6నెలలు మినహాయింపును ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయంతో ఓం ప్రకాశ్ చౌతాలాకు ఆరు నెలల మినహాయింపు లభించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడుగా ఓం ప్రకాశ్ చౌతాలా ఉన్నారు. హర్యానా ముఖ్యమంత్రిగా 4 సార్లు పదవి నిర్వహించిన విషయం తెలిసిందే. -
మాజీ సీఎంకు షాకిచ్చిన మాయావతి..!
చండీగఢ్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు పొత్తులపై దృష్టిసారించాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఎస్పీ అధినేత్రి మాయావతి కొత్త పొత్తులకు శ్రీకారం చుట్టారు. హర్యానా మాజీ సీఎం ఓమ్ ప్రకాశ్ చౌతాలాకి షాకిచ్చి మరోపార్టీతో చేతులు కలిపారు. చౌతాలా సారథ్యలోని ఐఎన్ఎల్డీకు మాయావతి గుడ్‌బై చెప్పి.. బీజేపీ రెబల్ ఎంపీ రాజ్‌కుమార్ సైనీ నేతృత్వంలోని లోక్తంత్రా సురక్షా పార్టీ( ఎల్ఎస్పీ)తో ఆమె చేతులు కలిపారు. ఈ మేరకు శనివారం రెండు పార్టీల నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ ఎనిమిది, ఎల్ఎస్పీ రెండు స్థానాల్లో కలిపి పోటీచేస్తున్నట్లు శనివారం వారు వెల్లడించారు. ఇదే పొత్తు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఐఎన్ఎల్డీ బలహీన పడుతున్నందునే మాయావతి వ్యూహాత్మకంగా ఎల్ఎస్పీతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీస్పీ, ఐఎన్ఎల్డీ వరస ఓటములను చవిచూసిన విషయం తెలిసిందే. -
‘రాసింది పదే.. ఇంటరెలా పాస్’
చండీగఢ్: హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కేవలం పదో తరగతి పరీక్షకు మాత్రమే హాజరైనట్లు ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్ఐఓఎస్) స్పష్టం చేసింది. ఆయన అసలు ఇంటర్ పరీక్ష రాయలేదని, ఇంటర్ పాస్ కాలేదని తెలిపింది. ఇంకా ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడికావాల్సి ఉందని, అయినా రాయని పరీక్షకు ఫలితాలు వెల్లడికాకముందే పాసయినట్లు ఎలా ఒక ప్రముఖ నేత ప్రకటించారో తమకు అర్థం కాలేదని తెలిపింది. తీహార్‌లో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ స్కూలింగ్ ద్వారా చౌతాలా హయ్యర్ సెకండరీ పూర్తి చేసినట్లు ఆయన కుమారుడు, ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మనవడు దుష్యంత్ వివాహం కోసం పెరోల్‌పై ఉన్న ఆయన.. ఏప్రిల్ 23న జైల్లో నిర్వహించిన పరీక్షకు హాజరైనట్లు అభయ్ వెల్లడించారు. అయితే, చౌతాలా ఏప్రిల్ 6 నుంచి 24 వరకు పరీక్షలకు హాజరైంది నిజమేనని, అయితే, ఇంటర్ పరీక్షలకు మాత్రం కాదని ఇన్స్టిట్యూట్ తెలిపింది. దీంతో ఈ విషయం ఇప్పుడు వివాదాస్పదం కానుంది. మరోపక్క, ఎన్నికల కమిషన్‌న నుంచి కూడా ఆయన చిక్కులు ఎదుర్కోనున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఆయన కొన్ని చోట్ల మెట్రిక్యూలేషన్ పాసైనట్లు, ఒక్కో చోట ఒక్కో ఇనిస్టిట్యూట్ పేరు అందులో రాశారు. -
చౌతాలా (82) ఇంటర్ పాసయ్యారు!
చండీగఢ్: హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా(82) హయ్యర్ సెకండరీ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. టీచర్ల నియామక కుంభకోణంలో దోషిగా తేలిన చౌతాలా ప్రస్తుతం తీహార్ జైలులో పదేళ్ల శిక్షఅనుభవిస్తున్నారు. తీహార్‌లో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ స్కూలింగ్ ద్వారా చౌతాలా హయ్యర్ సెకండరీ పూర్తి చేసినట్లు ఆయన కుమారుడు, ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా చెప్పారు. ప్రస్తుతం మనవడు దుష్యంత్ వివాహం కోసం పెరోల్‌పై ఉన్న ఆయన.. ఏప్రిల్ 23న జైల్లో నిర్వహించిన పరీక్షకు హాజరైనట్లు అభయ్ వెల్లడించారు. -
జైలులో చదివి.. మాజీ సీఎం ఇంటర్ పాస్
న్యూఢిల్లీ: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓమ్ ప్రకాశ్ చౌతాలా 82 ఏళ్ల వయసులో ఇంటర్ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న చౌతాలా డిగ్రీ చదవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల చదువు కోసం ఏర్పాటు చేసిన కేంద్రంలో నేషనల్ ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) ఇటీవల నిర్వహించిన పరీక్షలకు మాజీ సీఎం ఓమ్ ప్రకాశ్ హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాలలో ఆయన ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారని జైలు అధికారులు తెలిపారు. తండ్రి చౌతాలా ఫలితాలపై ఆయన కుమారుడు, హర్యానా అసెంబ్లీలో ప్రతిపక్షనేత అయిన అభయ్ సింగ్ చౌతాలా హర్షం వ్యక్తం చేశారు. 'మా నాన్న ఆఖరి పరీక్ష 23న రాశారు. ఆ సమయంలో పెరోల్ పై బయట ఉన్నా, జైలు పరిసరాల్లో ఉన్న కేంద్రానికి వెళ్లేవారు. మనవడు దుష్యంత్ సింగ్ చౌతాలా వివాహానికి హాజరు అయ్యేందుకు పెరోల్ మీద ఏప్రిల్ లో కొన్ని రోజులు మాతో గడిపారు. మే5న పెరోల్ గడువు ముగియడంతో మళ్లీ జైలుకు వెళ్లారు' అని అభయ్ సింగ్ వివరించారు. 2000 సంవత్సరంలో జరిగిన 3,206 టీచర్ల నియామకాల్లో అవినీతికి పాల్పడ్డ కేసులో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా జైలుశిక్ష అనుభవిస్తున్నారు. మాజీ సీఎం సహా 53 మందికి ఈ అవినీతిలో భాగం ఉందని 2013లో ట్రయల్ కోర్టు విచారణ చేపట్టింది. చివరకు 2015లో సుప్రీంకోర్టు ఆయనకు పదేళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే. -
మాజీ సీఎం పిటిషన్ కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: హర్యానా టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. చౌతాలా, మరో తొమ్మిది మంది దాఖలు చేసిన పిటిషన్‌ను.. సోమవారం జస్టిస్ కలిఫుల్లా సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది. 1999 టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ చౌతాలా, మరో ఎనిమిది మంది నిందితులుగా ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు వీరిని దోషులుగా ప్రకటిస్తూ పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను రద్దు చేయాలంటూ చౌతాలా సుప్రీం కోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. -
ఇక చాలు.. జైలుకెళ్లి కూర్చోండి!
ఆరోగ్యం బాగోలేదంటూ బెయిల్ తీసుకుని.. ఎన్నికల ప్రచారపర్వంలో మాత్రం మహా దూకుడు ప్రదర్శిస్తున్న హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా (79)కి ఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఆదివారం మళ్లీ వెళ్లి జైల్లో కూర్చోవాలని ఆదేశించింది. చౌతాలా బెయిల్‌ను రద్దు చేసిన కోర్టు.. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడా పాల్గొనకూడదని ఆదేశించింది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చౌతాలా.. విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఆయనకు పదేళ్ల జైలుశిక్ష పడింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టుకున్నట్లు కూడా కేసు నమోదై, దానిమీద కూడా విచారణ జరిగింది. అయితే, 2013 మే నేలలో తనకు ఆరోగ్యం బాగోలేదని, గుండె సమస్య ఉందని చెప్పి తీహార్ జైలు నుంచి బెయిల్ మీద బయట పడ్డారు. ఇప్పుడు మళ్లీ ఒకవేళ చౌతాలాకు ఆరోగ్యం బాగోలేదని, ఆయన ఇబ్బంది పడుతున్నారని జైలు అధికారులు భావిస్తే ప్రభుత్వరంగంలోని ఎయిమ్స్‌కు మాత్రమే పంపాలని కోర్టు చెప్పింది. అయితే, బెయిల్ నిబంధనలలో తాను ప్రజలను కలవకూడదన్న విషయం ఎక్కడా లేదని, అలాంటప్పుడు తనను ఎన్నికల ప్రచారం చేయనివ్వకపోవడం సమంజసం కాదని చౌతాలా విలేకరులతో అన్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో మళ్లీ తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని, ఆయన జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారని చౌతాలా కుమారుడు అభయ్ (51) అంటున్నారు. కానీ, సుప్రీంకోర్టులో కేసు గెలిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఎందుకంటే.. రెండేళ్లకు మించి శిక్ష పడినవాళ్లు ఎలాంటి పదవులు అనుభవించడానికి గానీ, ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు. -
ఆరోగ్యం బాగోలేదు గానీ.. ప్రచారంలో దూకుతారా?
రాజకీయ నాయకులకు పదవిలో ఉన్నా.. ఎన్నికలు వస్తున్నాయన్నా ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అదే కోర్టులు, అరెస్టులు అనేసరికి మాత్రం ఉన్నట్టుండి ఆస్పత్రిలో చేరిపోతారు. హర్యానాకు చెందిన కురువృద్ధ నాయకుడు ఓం ప్రకాష్ చౌతాలా (79) విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఆ రాష్ట్రంలో వచ్చేవారం ఎన్నికలు ఉండటంతో ఆయన ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. చురుగ్గా తిరుగుతున్నారు. అయితే, మరోవైపు ఆరోగ్యం బాగోలేదంటూ బెయిల్ ఇప్పించాలని కోర్టును కోరారు. దాంతో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు ఆగ్రహం వచ్చింది. మేదాంత మెడిసిటీ ఆస్పత్రి నుంచి అసలు బయటకు ఎందుకు వెళ్లారో వివరించాలని ఢిల్లీ హైకోర్టు ఆయనను ఆదేశించింది. 1999 నాటి టీచర్ల నియామకంలో అవినీతి కేసులో చౌతాలాకు పదేళ్ల జైలుశిక్ష పడింది. ఆయన ప్రస్తుతం బెయిల్ మీద విడుదలై ప్రచారం చేసుకుంటున్నారు. దాంతో, బెయిల్ రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టును సీబీఐ కోరింది. దాంతో.. ఆయన అంతలా రాజకీయ సమావేశాల్లో పాల్గొంటుంటే, సీబీఐ ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని సీబీఐని జడ్జి ప్రశ్నించారు. తాము ప్రయత్నించాము గానీ... ఒకసారి ఆయన పొగరు చూడాలని సీబీఐ తరఫు న్యాయవాది అన్నారు. చౌతాలా తమ వద్దకు సీబీఐ కస్టడీలో రాలేదని, మామూలు పేషెంటుగానే వచ్చారని, అలా వచ్చినవాళ్లు వెళ్లిపోతామంటే తాము బలవంతంగా అట్టిపెట్టుకోలేమని మేదాంత మెడిసిటీ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ నరేష్ ట్రెహాన్ చెప్పారు. -
హర్యానా రాజకీయాల్లో యోయో హానీసింగ్!
చండీఘడ్: ర్యాప్ మ్యూజిక్ తో, ముఖ్యంగా 'లుంగీ డ్యాన్స్' పాటతో సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన రాప్ సింగర్ యో యో హానీసింగ్ మరో కొత్త పాత్రలో కనిపించనున్నారు. హర్యానాలో జరుగనున్న ఎన్నికల ప్రచారంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో తమ పార్టీకి మద్దతుగా యోయో హానీసింగ్ పాల్గొంటారని ఆ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు కరణ్ చౌతాలా మీడియాకు వెల్లడించారు. అవినీతి ఆరోపణల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఓం ప్రకాశ్ చౌతాలా బెయిల్ బయటకు వచ్చారు. ఆయన కూడా పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి చౌతాలా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2005 తర్వాత అధికారాన్ని కోల్పోయిన చౌతాలా అవినీతి ఆరోపణల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. హర్యానా రాష్ట్రంలో అక్టోబర్ 15 తేదిన ఎన్నికలు జరుగనున్నాయి. -
తక్షణమే రద్దు చేయండి
న్యూఢిల్లీ: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలాకు మంజూరైన బెయిల్‌ను తక్షణమే రద్దుచేయాలని కోరుతూ సీబీఐ... ఢిల్లీ హైకోర్టుకు విన్నవింది. ఈ మేరకు శనివారం ఓ పిటిషన్ దాఖలుచేసింది. అనారోగ ్యం సాకుతో బెయిల్ పొందిన చౌతాలా... ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొనడంద్వారా బెయిల్ పొందే సమయంలో విధించిన నిబంధలను ఉల్లంఘించారని సీబీఐ తన పిటిషన్లో ఆరోపించింది. ఈ ఏడాది మే నెలలో బెయిల్ పొందిన చౌతాలాకు ఉపాధ్యాయుల నియామకం కుంభకోణం కేసులో పదేళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్న సంగతి విదితమే. కాగా 76 ఏళ్ల చౌతాలా అనేక పర్యాయాలు బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని సీబీఐ ఆరోపించింది. గత నెల 25వ తేదీన హర్యానాలోని జింద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నాడని తెలిపింది. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినందువల్ల తక్షణమే దానిని రద్దుచేసి చౌతాలాను తిరిగి కారాగారానికి పంపాల్సిందిగా కోరింది. కాగా ఉపాధ్యాయ నియామకాల్లో కుంభకోణం కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్‌తోపాటు మరో ఎనిమిది మందిని దోషులుగా నిర్ధారించింది. వారికి పది సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ 2013, జనవరి 22వ తేదీన తీర్పు వెలువరించిన సంగతి విదితమే. -
చౌతాలాకు మూడు వారాల బెయిల్
న్యూఢిల్లీ: టీచర్ల నియామకం కేసులో పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలాకు ఢిల్లీ హైకోర్టు మూడు వారాలపాటు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. వివరాలిలా ఉన్నాయి. చౌతాలా చిన్న సోదరుడు ప్రతాప్ సింగ్ గత శనివారం మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా, తమ్ముడి అంత్యక్రియలకు హాజరు కావడమే కాకుండా, ఇంటికి పెద్దవాడిగా తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, అందువల్ల తనకు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించాల్సిందిగా సీబీఐను సోమవారం హైకోర్టు ఆదేశించింది. చౌతాలా సోదరుడి మృతి నేపథ్యంలో అతడికి బెయిల్ మంజూరుకు తమకేమీ అభ్యంతరమైమీ లేదని, అయితే బెయిల్ గడువును తగ్గించాలని సీబీఐ కోరింది. అలాగే అతడు న్యాయస్థాన పరిధి నుంచి పారిపోకుండా ఆంక్షలు విధించాలని విన్నవించింది. ఇదిలా ఉండగా, సోమవారం జరిగిన విచారణలో తన సోదరుడి మృతికి సంబంధించి చౌతాలా నిర్వహించే కార్యక్రమాలపై తమకు సమగ్ర నివేదిక అందజేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అంతకుముందు సీబీఐ చౌతాలా మధ్యస్త బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించింది. అతడు పోలీస్ కస్టడీలో తమ్ముడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తాము ఇప్పటికే అనుమతించామని కోర్టుకు తెలిపింది. మే 30వ తేదీన సాధారణ బెయిల్ కోసం చౌతాలా హైకోర్టును ఆశ్రయించగా, కేసును జూలై 11వ తేదీనికి వాయిదా వేయిందని సీబీఐ వివరించింది. కాగా, చౌతాలా తరఫు న్యాయవాది హరిహరన్ మాట్లాడుతూ తనకు ఆరోగ్యం సరిగా లేనందున బెయిల్ మంజూరుచేయాలని చౌతాలా కోర్టును ఆశ్రయించారన్నారు. అయితే ప్రస్తుతం మధ్యస్త బెయిల్ కోసం ఒక ప్రత్యేక పరిస్థితిలో దరఖాస్తు చేయాల్సి వచ్చిందని వాదించారు. కాగా, మంగళవారం జరిగిన వాదనలను విన్న జస్టిస్ కైలాస్ గంభీర్, మాజీ సీఎం చౌతాలాకు మూడు వారాల మధ్యస్త బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
అనారోగ్యం ఉంటే అధికారం వద్దంటారా: చౌతాలాపై సుప్రీం వ్యాఖ్యలు
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన స్కాంలో ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా దోషులుగా తేలిన విషయం తెలిసిందే. తనకు అనేక వ్యాధులున్నాయని, అందువల్ల తాను బయటే ఉండేందుకు అనుమతించాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. చౌతాలా పేర్కొన్న వ్యాధులన్నీ వృద్ధాప్యం కారణంగా వచ్చేవేనని కోర్టు తెలిపింది. ''నాకు ఒకటి అనిపిస్తోంది. ఒకవేళ పిటిషనర్‌కు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం వస్తే, మాకు చెప్పిన వ్యాధులను కారణంగా చూపించి పదవిని వద్దంటారా'' అని జస్టిస్ దత్తు వ్యాఖ్యానించారు. అనారోగ్యం ఉన్నవాళ్లంతా జైలు వద్దంటే, కేవలం ఆరోగ్యవంతులకు మాత్రమే జైలు పరిమితం అవుతుందని జస్టిస్ ముఖోపాధ్యాయ అన్నారు. అయితే.. జైలు అధికారుల వద్ద సెప్టెంబర్ 23లోగా లొంగిపోయేందుకు మాత్రం చౌతాలాకు కోర్టు అనుమతినిచ్చింది. ఆయనకు తగిన, సమర్ధమైన, నిపుణులతో వైద్య చికిత్సలు అందించాలని జైలు అధికారులకు సూచించింది.