ఇక చాలు.. జైలుకెళ్లి కూర్చోండి!
ఆరోగ్యం బాగోలేదంటూ బెయిల్ తీసుకుని.. ఎన్నికల ప్రచారపర్వంలో మాత్రం మహా దూకుడు ప్రదర్శిస్తున్న హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా (79)కి ఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఆదివారం మళ్లీ వెళ్లి జైల్లో కూర్చోవాలని ఆదేశించింది. చౌతాలా బెయిల్ను రద్దు చేసిన కోర్టు.. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడా పాల్గొనకూడదని ఆదేశించింది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చౌతాలా.. విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఆయనకు పదేళ్ల జైలుశిక్ష పడింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టుకున్నట్లు కూడా కేసు నమోదై, దానిమీద కూడా విచారణ జరిగింది. అయితే, 2013 మే నేలలో తనకు ఆరోగ్యం బాగోలేదని, గుండె సమస్య ఉందని చెప్పి తీహార్ జైలు నుంచి బెయిల్ మీద బయట పడ్డారు. ఇప్పుడు మళ్లీ ఒకవేళ చౌతాలాకు ఆరోగ్యం బాగోలేదని, ఆయన ఇబ్బంది పడుతున్నారని జైలు అధికారులు భావిస్తే ప్రభుత్వరంగంలోని ఎయిమ్స్కు మాత్రమే పంపాలని కోర్టు చెప్పింది.
అయితే, బెయిల్ నిబంధనలలో తాను ప్రజలను కలవకూడదన్న విషయం ఎక్కడా లేదని, అలాంటప్పుడు తనను ఎన్నికల ప్రచారం చేయనివ్వకపోవడం సమంజసం కాదని చౌతాలా విలేకరులతో అన్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో మళ్లీ తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని, ఆయన జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారని చౌతాలా కుమారుడు అభయ్ (51) అంటున్నారు. కానీ, సుప్రీంకోర్టులో కేసు గెలిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఎందుకంటే.. రెండేళ్లకు మించి శిక్ష పడినవాళ్లు ఎలాంటి పదవులు అనుభవించడానికి గానీ, ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు.