సాక్షి, న్యూఢిల్లీ: అక్రమ ఆస్తుల కేసులో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా(86)కు ఢిల్లీ న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.50 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించింది. అధికారులు ఆయన్ను శుక్రవారం తిహార్ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రెండో నంబర్ జైలులో మరో ఇద్దరితో కలిపి ఆయనకు గదిని కేటాయిస్తామని అధికారులు తెలిపారు.
1993–2006 మధ్య కాలంలో ఆయన ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధూల్ గత వారమే చౌతాలాను దోషిగా నిర్ధారించారు. చౌతాలా ఆస్తుల్ని కూడా జప్తు చేయాలని ఆదేశించారు. 2005లో చౌతాలాపై కేసు నమోదు చేసిన సీబీఐ 2010 మార్చి 26న చార్జిషీటు దాఖలు చేసింది.
హరియాణా సీఎంగా ఉన్న కాలంలో చౌతాలా తన పేరుతో, కుటుంబ సభ్యుల పేర్లతో భారీగా స్థిర, చరాస్తులెన్నిటినో కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆయన వాస్తవంగా చూపిన ఆదాయం కంటే 189.11% ఎక్కువగా, అంటే రూ.6.09 కోట్ల ఆస్తుల్ని సమకూర్చుకున్నారని, ఇందుకు తగిన ఆధారాలను చూపలేకపోయారని సీబీఐ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment