ర్యాలీ వేదికపై ఓపీ చౌతాలా, శరద్ పవార్, నితీశ్, తేజస్వీ యాదవ్, ఏచూరి, బాదల్ తదితరులు
ఫతేబాద్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించడానికి కాంగ్రెస్ పార్టీతో కూడిన కొత్త కూటమి ఏర్పాటు కావాలని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నాయకుడు నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ఐక్య కూటమి బరిలోకి దిగాల్సిన అవసరముందన్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అనే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. బీజేపీని ఓడించడం కాంగ్రెస్‌తో కూడిన కూటమితోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
దివంగత ఉప ప్రధానమంత్రి దేవీలాల్ జయంతి సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్‌ఎల్‌డీ) ఆధ్వర్యంలో ఆదివారం హరియాణాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. నితీశ్‌తోపాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఐఎన్‌ఎల్‌డీ నేత ఓంప్రకాశ్ చౌతాలా, శిరోమణి అకాలీదళ్ నాయకుడు సుఖ్‌బీర్‌సింగ్ బాదల్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన నాయకుడు అరవింద్ సావంత్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ నేతలెవరూ పాల్గొనలేదు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ సీఎంలు మమతా బెనర్జీ, కేసీఆర్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా దూరంగా ఉండడం గమనార్హం.
కేంద్రంలో మార్పు జరిగితేనే..
రాజకీయ లబ్ధి కోసం హిందూ, ముస్లిం అంటూ ప్రజలను బీజేపీపై విభజిస్తోందని నేతలు నిప్పులు చెరిగారు. తప్పుడు హామీలిస్తూ మభ్యపెడుతోందని విమర్శించారు. జీవనోపాధి లేక రైతులు, యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే పరిష్కార మార్గమన్నారు. కేంద్రంలో మార్పు జరిగితేనే రైతన్నలు, నిరుద్యోగ యువత జీవితాలు బాగుపడతాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
మెయిన్ ఫ్రంట్ కావాలి
దేశాన్ని సరైన దిశలో నడిపించలేకపోతున్న మేనేజర్(ప్రధానమంత్రి)ని మార్చేయాలని ఏచూరి అన్నారు. కాంగ్రెస్‌తో సహా విపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావాలన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు లేకుండా విపక్ష ఫ్రంట్ అసాధ్యమని నితీశ్ తేల్చిచెప్పారు. సమస్యలను వదిలి బీజేపీ ముస్లిం, పాకిస్తాన్, మందిర్, మసీద్ జపం చేస్తోందని తేజస్వీ ధ్వజమెత్తారు. ఇప్పుడు ఎన్డీయే ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ అంటే బడా ఝూటా పార్టీ అని ఎద్దేవా చేశారు. బహిరంగ సభ అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి పదవికి తాను పోటీ పడడం లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment