‘రాసింది పదే.. ఇంటరెలా పాస్’
చండీగఢ్: హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కేవలం పదో తరగతి పరీక్షకు మాత్రమే హాజరైనట్లు ది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్‌ఐఓఎస్) స్పష్టం చేసింది. ఆయన అసలు ఇంటర్ పరీక్ష రాయలేదని, ఇంటర్ పాస్ కాలేదని తెలిపింది. ఇంకా ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడికావాల్సి ఉందని, అయినా రాయని పరీక్షకు ఫలితాలు వెల్లడికాకముందే పాసయినట్లు ఎలా ఒక ప్రముఖ నేత ప్రకటించారో తమకు అర్థం కాలేదని తెలిపింది. తీహార్‌లో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ స్కూలింగ్ ద్వారా చౌతాలా హయ్యర్ సెకండరీ పూర్తి చేసినట్లు ఆయన కుమారుడు, ఐఎన్‌ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా చెప్పిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మనవడు దుష్యంత్ వివాహం కోసం పెరోల్‌పై ఉన్న ఆయన.. ఏప్రిల్ 23న జైల్లో నిర్వహించిన పరీక్షకు హాజరైనట్లు అభయ్ వెల్లడించారు. అయితే, చౌతాలా ఏప్రిల్ 6 నుంచి 24 వరకు పరీక్షలకు హాజరైంది నిజమేనని, అయితే, ఇంటర్ పరీక్షలకు మాత్రం కాదని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. దీంతో ఈ విషయం ఇప్పుడు వివాదాస్పదం కానుంది. మరోపక్క, ఎన్నికల కమిషన్‌న నుంచి కూడా ఆయన చిక్కులు ఎదుర్కోనున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఆయన కొన్ని చోట్ల మెట్రిక్యూలేషన్ పాసైనట్లు, ఒక్కో చోట ఒక్కో ఇనిస్టిట్యూట్ పేరు అందులో రాశారు.