న్యూఢిల్లీ: టీచర్ల నియామకం కేసులో పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలాకు ఢిల్లీ హైకోర్టు మూడు వారాలపాటు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. వివరాలిలా ఉన్నాయి. చౌతాలా చిన్న సోదరుడు ప్రతాప్ సింగ్ గత శనివారం మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా, తమ్ముడి అంత్యక్రియలకు హాజరు కావడమే కాకుండా, ఇంటికి పెద్దవాడిగా తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, అందువల్ల తనకు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించాల్సిందిగా సీబీఐను సోమవారం హైకోర్టు ఆదేశించింది. చౌతాలా సోదరుడి మృతి నేపథ్యంలో అతడికి బెయిల్ మంజూరుకు తమకేమీ అభ్యంతరమైమీ లేదని, అయితే బెయిల్ గడువును తగ్గించాలని సీబీఐ కోరింది. అలాగే అతడు న్యాయస్థాన పరిధి నుంచి పారిపోకుండా ఆంక్షలు విధించాలని విన్నవించింది.
ఇదిలా ఉండగా, సోమవారం జరిగిన విచారణలో తన సోదరుడి మృతికి సంబంధించి చౌతాలా నిర్వహించే కార్యక్రమాలపై తమకు సమగ్ర నివేదిక అందజేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అంతకుముందు సీబీఐ చౌతాలా మధ్యస్త బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించింది. అతడు పోలీస్ కస్టడీలో తమ్ముడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తాము ఇప్పటికే అనుమతించామని కోర్టుకు తెలిపింది. మే 30వ తేదీన సాధారణ బెయిల్ కోసం చౌతాలా హైకోర్టును ఆశ్రయించగా, కేసును జూలై 11వ తేదీనికి వాయిదా వేయిందని సీబీఐ వివరించింది. కాగా, చౌతాలా తరఫు న్యాయవాది హరిహరన్ మాట్లాడుతూ తనకు ఆరోగ్యం సరిగా లేనందున బెయిల్ మంజూరుచేయాలని చౌతాలా కోర్టును ఆశ్రయించారన్నారు. అయితే ప్రస్తుతం మధ్యస్త బెయిల్ కోసం ఒక ప్రత్యేక పరిస్థితిలో దరఖాస్తు చేయాల్సి వచ్చిందని వాదించారు. కాగా, మంగళవారం జరిగిన వాదనలను విన్న జస్టిస్ కైలాస్ గంభీర్, మాజీ సీఎం చౌతాలాకు మూడు వారాల మధ్యస్త బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
చౌతాలాకు మూడు వారాల బెయిల్
Published Tue, Jun 3 2014 9:56 PM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement
Advertisement