సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధానిలో బాడీబిల్డర్లకు భారీ డిమాండ్ నెలకొంది. అభ్యర్ధులకు భద్రతగా వెన్నంటి నిలవడంతో పాటు, ప్రత్యర్ధుల నుంచి దాడుల ముప్పును తిప్పికొట్టేందుకు బౌన్సర్లను నియమించుకునేందుకు అభ్యర్ధులు మొగ్గుచూపుతున్నారు. పోలింగ్ ముగిసేవరకూ ఆరు నుంచి ఏడుగురు బౌన్సర్లను తమ చుట్టూ తిప్పుకునేందుకు అభ్యర్ధులు, కీలక నేతలు ఆసక్తి కనబరుస్తుండటంతో జిమ్‌లు, సెక్యూరిటీ ఏజెన్సీల వద్ద సందడి నెలకొంది.
పోలింగ్ తేదీ వరకూ రోజూ 24 గంటల పాటు అభ్యర్ధుల వెన్నంటి ఉండేలా కండలుతీరిన దేహం కలిగిన వారిని రిక్రూట్ చేసుకుంటున్నామని, దీనికోసం వారికి రోజుకు ఆరు నుంచి ఏడు వేల రూపాయల వరకూ ముట్టచెపుతున్నామని ఓ పార్టీ కీలక నేత చెప్పుకొచ్చారు. బాడీబిల్డర్లు ఆహారం కోసమే రోజుకు రూ 3000 నుంచి 3500 వెచ్చిస్తారని, దాంతో పాటు ఏరియా, అతని రేటింగ్స్‌ను బట్టి బౌన్సర్‌కు రోజుకు రూ 2000 నుంచి 3000 వరకూ చెల్లిస్తామని వెల్లడించారు.
మరోవైపు అభ్యర్ధులు, రాజకీయ నేతల చుట్టూ చేరిన బౌన్సర్లతో పోలీసులకు పెనుసవాల్ ఎదురవుతోంది. రాజకీయ పార్టీల ర్యాలీల సందర్భంగా బౌన్సర్ల ఆగడాలు పెరగడం, ఓటర్లు, ప్రత్యర్ధి పార్టీల కార్యకర్తలపై దురుసు ప్రవర్తనతో హింసాత్మక ఘటనలు చెలరేగుతాయనే ఆందోళన ఖాకీలను వెంటాడుతోంది. బౌన్సర్లకు చెక్ పెట్టేందుకు పోలీసులు ఢిల్లీ సహా పరిసర ప్రాంత జిమ్‌లపై తనిఖీ చేపట్టారు.
జిమ్‌లకు రోజూ వచ్చే వ్యక్తుల జాబితాను పరిశీలిస్తూ వరుసగా రెండు రోజులు జిమ్‌కు హాజరుకాని బాడీబిల్డర్లను గుర్తించి వారిపై ఆరా తీస్తున్నారు. బౌన్సర్ల కారణంగా పోలింగ్ ఏజెంట్లపై దాడులు, ఎన్నికల సందర్భంగా అల్లర్లు తలెత్తకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టామని ఢిల్లీ పోలీస్ ప్రతినిధి మాధుర్ వర్మ వెల్లడించారు. కాగా ఏప్రిల్ 11న ఏడు దశల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుండగా, ఢిల్లీలో ఆరో విడత మే 12న పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment