
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించింది. కోటి రూపాయలతోపాటు అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. అల్లర్లలో మృతి చెందిన రతన్ లాల్‌ను అమరవీరుడిగా ప్రకటించింది. ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌పురిలో సోమవారం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ఈ దాడిలో ప్రాణాలు విడిచారు. బుల్లెట్ గాయం వల్లే ఆయన చనిపోయాడని పోస్ట్‌మార్టమ్ నివేదికలో తేలింది.(ముస్లిం కుటుంబాన్ని కాపాడిన బీజేపీ కౌన్సిలర్)
ఈ నేపథ్యంలో రతన్‌లాల్‌ను అమర వీరుడిగా ప్రకటించాలంటూ ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం ఆందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వం అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇక ఈ ఘటనపై హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమరవీరుడి ఆత్మకు శాంతిని చేకూరాలని కోరుతూ రతన్‌లాల్ భార్యకు లేఖ రాశారు. ‘రతన్‌లాల్ ధైర్యశాలి, కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న ధీరోదాత్తుడు. దేశ సేవలో తన ప్రాణాలనే అర్పించిన వీర సైనికుడు’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. (సీఏఏ రగడ : హెడ్ కానిస్టేబుల్ మృతి)