మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని, అయితే ఇది తమ పార్టీ ఎన్నికల అంశం కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. రామమందిర నిర్మాణాన్ని బీజేపీ ఎన్నడూ స్వార్ధరాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టలేదన్నారు. మందిర నిర్మాణంపై ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురావాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ఆయన గతంలోనూ ఇలా కోరారని, రానున్న ఎన్నికలతో దీనికి సంబంధం లేదని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్‌లో చట్టం చేయడం లేదా కోర్టు తీర్పు వంటి రెండు మార్గాల ద్వారానే మందిర నిర్మాణం చేపట్టవచ్చన్నారు. సోమనాథ్ దేవాలయం విషయంలో ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిన విషయాన్ని ఫడ్నవీస్ ప్రస్తావించారు. రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా చట్టం తీసుకురావడానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడం సమస్యగా ఆయన చెప్పుకొచ్చారు. రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదన్న సంగతి గుర్తెరగాలన్నారు. మందిర నిర్మాణంపై సుప్రీం కోర్టు సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే విశ్వాసం తమకుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment