12న ఫడ్నవీస్ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష!
ముంబై: మహారాష్ట్ర సీఎంగా ఎన్నికైన దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నెల 12వ తేదీన విశ్వాస పరీక్ష ఎదుర్కొవడానికి సిద్ధమవుతున్నారు. ఫడ్నవీస్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొవడానికి 24 స్థానాల దూరంలో ఉంది. ఇదిలా ఉండగా నేటినుంచి మూడు రోజుల పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. సోమవారం ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే సోమవారం ప్రోటెం స్పీకర్ గా జీవ పండు గావిట్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు రాజ్ భవన్ లో మహారాష్ట్ర గవర్నర్ సి. విద్యాసాగర్ రావు..గావిట్ చేత ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. అనంతరం 12 వ తేదీ విశ్వాస పరీక్ష అంశానికి సంబంధించి ఫడ్నవీస్ స్పీకర్ అనుమతి కోరతారు.
ఇప్పటికే విశ్వాస పరీక్ష అంశంపై బీజేపీ ప్రభుత్వానికి బయటనుంచి మద్దతిస్తామని 41 మంది సభ్యులున్న ఎన్సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. 122 శాసనసభా స్థానాలు గెలుచుకొని బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే 288 స్థానాలు గల సభలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 145 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంది. బీజేపి మిత్రపక్షమైన రాష్ట్రీయ సమాజ్‌పక్ష ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. శివసేన 63, కాంగ్రెస్ 42, ఎన్సీపీకి 41 స్థానాలను సాధించాయి.