పళని రాజీనామా చేయాల్సిందేః దినకరన్
సాక్షి,చెన్నయ్: తమిళనాడు సీఎం పళనిస్వామి పదవి నుంచి వైదొలగి నూతన శాసనసభా పక్ష నేత ఎంపికకు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని పార్టీ వేటుకు గురైన టీటీవీ దినకరన్ డిమాండ్ చేశారు. సీఎం ముందుగా గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించాలని, తర్వాత ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని కోరారు. పళనిస్వామికి సీఎం పదవి, క్యాబినెట్‌ను చిన్నమ్మే (శశికళ) ప్రసాదించారని, అందుకే తాము పళనిని సీఎం పదవికి రాజీనామా చేసి వేరొకరికి అప్పగించాలని కోరుతున్నామన్నారు.
తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల జాబితాను పళనిస్వామికి పంపుతానని, అయితే వారు విశ్వాస పరీక్ష సందర్భంగా పళనికి ఓటు వేయకపోతే దానికి తాను బాధ్యత వహించనని దినకరన్ స్పష్టం చేశారు. గత నెలలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఏకమైన క్రమంలో దినకరన్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు పళనిస్వామి ప్రభుత్వంపై వేటు వేయాలని కోరుతూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.