‘సింధూ నాగరికత’ వారసులు తమిళులా! | Did The indus People Settled In Tamilnadu | Sakshi
Sakshi News home page

‘సింధూ నాగరికత’ వారసులు తమిళులా!

Published Wed, Sep 18 2019 3:53 PM | Last Updated on Wed, Sep 18 2019 3:53 PM

Did The indus People Settled In Tamilnadu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : క్రీస్తు పూర్వం ఐదువేల సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల వరకు కొనసాగిన సింధూలోయ నాగరికతకు అసలైన వారసులు ఎవరు ? నాడు  సింధూలోయలో నివసించిన ప్రజలు భారత్‌–ఐరోపా ప్రాంతాల నుంచి పశువుల కాపర్లు వలస రావడంతో ఎక్కడికి పోయారు ? అప్పటికే సంక్లిష్ట పట్టణ సంస్కతి కలిగిన సింధూ లోయ పూర్వికుల జాడలు నేడెక్కడ? అసలు సింధూ నాగరికుల భాష ఏమిటీ ? ఎప్పటి నుంచో భారతను తొలుస్తున్న ప్రశ్నలివి. తామే సింధూ నాగరికతకు వారసులమని, ద్రావిడుల మూల భాషే సింధూ భాషంటూ, అందుకు భాషాపరమైన ఆధారాలు ఎన్నో ఉన్నాయంటూ ద్రావిడ ఉద్యమంతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో చేస్తున్న వాదనలో నిజమెంత ? 

సింధూ లోయ నాగరికతకు అసలైన వారసులు తమిళులేనంటూ తమిళ సాహిత్యం ఎప్పటి నుంచో చెబుతున్న నేపథ్యంలో వాస్తావాస్తవాలను తెలుసుకునేందుకు భారత చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. అందులో భాగంగా ముందుగా తమిళుల పూర్వికుల ఎవరో తెలుసుకునేందుకు తమిళనాడులోని అరిక్కమేడు ప్రాంతంలో 1947లో, కావేరిపూంపట్టిణం ప్రాంతంలో 1965లో, అదినాఛల్లార్‌ ప్రాంతంలో 2005లో భారత పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. సింధూ నాగరికతకు తమిళనాడుకు సంబంధం ఉన్న దాఖలాలేవీ ఈ మూడు తవ్వకాల్లో లభించలేదు.

కానీ సెల్, సైన్స్‌ అనే శాస్త్రవిజ్ఞాన పత్రికలు తాజాగా ప్రచురించిన వ్యాసాల కథనం ప్రకారం   2015లో తమిళనాడులోని మధురై, శివగంగాయ్‌ జిల్లాల సరిహద్దులోని కీళడి (వాయ్‌గాయ్‌ నది ఒడ్డున) వద్ద ‘ఆర్కియాలోజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ జరిపిన తవ్వకాల్లో సరైన ఆధారాలు దొరికాయి. సంగం కాలానికి చెందిన క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితం నాటి ‘వస్తువులు, పాత్రలు’ లభించాయి. నాలుగో శతాబ్దం నుంచి క్రీస్తు శకం రెండో శతాబ్దం వరకు తమిళ సంస్కతి పరిఢవిల్లిన కాలాన్ని సంగం కాలంగా వ్యవహరిస్తారు. సింధూ సంక్లిష్ట పట్టణ నాగరికతకు, తమిళుల సంక్లిష్ట పట్టణ నాగరికతకు సంబంధం ఉన్నట్లు ఈ పాత్రలు, వస్తువులు తెలియజేస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రాజెక్ట్‌కు పర్యవేక్షణాధికారిగా ఉన్న అమర్‌నాథ్‌ రామకష్ణ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ధ్రువీకరించారు.

దీంతో అమర్‌నాథ్‌ రామకష్ణను మరోచోటుకు బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ వెంటనే కీళడి తవ్వకాలను 2017లో నిలిపి వేసింది. దీనిపై డీఎంకే సహా అన్ని ద్రావిడ రాజకీయ పార్టీలు గొడవ చేశాయి. మరోపక్క అమర్‌నాథ్‌ రామకష్ణ తన బదిలీ అక్రమమంటూ కోర్టుకు వెళ్లిన లాభం లేకపోయింది. ఇది ఇంతకాలం వాదిస్తున్న స్వతంత్ర వైదిక నాగరికతకు భిన్నంగా ఉందనే ఉద్దేశంతోనే కేంద్రం తవ్వకాలను నిలిపేసినట్లు ద్రావిడ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయినా కేంద్రం పట్టించుకోకపోవడంతో తమిళనాడు పురాతత్వ రాష్ట్ర విభాగం 2018లో కీళడి త్రవ్వకాల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొంది. మరో రెండు విడతల తవ్వకాలు చేపట్టి ప్రస్తుతం పనులను నిలిపివేసింది. ఈ తాజా తవ్వకాలకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక వెలువడే అవకాశం ఉంది. 

తమిళుల వాదనతో 1964లోనే రష్యా, ఫిన్‌లాండ్‌ శాస్త్రవేత్తలు అంగీకరించారు. ప్రపంచంలోనే సింధూ నాగరికత లిపిలపై అమోఘమైన పట్టును సాధించిన హెల్సింకి యూనివర్శిటీకి చెందిన చారిత్రక భాషాశాస్త్రవేత్త ఆస్కో పర్పోలా కూడా తమిళుల వాదనలో నిజం లేకపోలేదన్నారు. తమిళ మూల భాష లిపికి, సింధూ ప్రధాన లిపికి సామీప్యత కనిపిస్తోందని, అయితే ఈ దిశగా మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేటి ఆధునిక రోజుల్లో పురాతత్వ తవ్వకాల్లో డీఎన్‌ఏ శోధనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకని తవ్వకాల లోతుల్లోకి వెళితే తప్పకుండా డీఎన్‌ఏ ఆనవాళ్లు దొరుకుతాయని భావిస్తున్న తమిళ పురాతత్వ విభాగం ఆ దిశగా 2020, జనవరి నెల నుంచి తవ్వకాలు ప్రారంభించాలని నిర్ణయించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement