‘చమురు’ వదిలిస్తున్న డీజిల్
న్యూఢిల్లీ: రూపాయి విలువ పతనంతో డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్‌ల అమ్మకాలపై ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు భారీగానే చేతి చమురు వదులుతోంది. ప్రతి లీటరు డీజిల్ అమ్మకంపై నష్టం ఇటీవల ఏకంగా రూ.14.50లకు పెరిగింది. డీజిల్ అమ్మకాల వల్ల మూడు చమురు కంపెనీలు రోజుకు రూ.486 కోట్లు నష్టపోతున్నాయి. దీంతో, వేగంగా పెరుగుతున్న నష్టాన్ని భారీగా తగ్గించుకునే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు సమాచారం. లీటరు డీజిల్‌పై నెలకు 50 పైసల చొప్పున ధర పెంచుకోవడానికి గత జనవరిలో కేంద్రం చమురు సంస్థలకు అనుమతి ఇచ్చింది. అయితే, రూపాయి విలువ తరిగిపోవడం వల్ల వస్తున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి ఈ పెంపు చాలదని ఈ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. లీటరు డీజిల్‌పై నెల నెలా రూపాయి పెంచడం గానీ లేదా ఒకేసారి రూ.3 నుంచి రూ.5 వరకూ గానీ పెంచితే తప్ప ఈ నష్టాల నుంచి బయటపడడం సాధ్యం కాదని చమురు శాఖ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
గత నెల రెండో పక్షంలో లీటరు డీజిల్‌పై నష్టం రూ.12.12 ఉండగా, ఇప్పుడు అది రూ.14.50 చేరింది. చౌకదుకాణాల్లో సబ్సిడీపై అమ్ముతున్న ప్రతి లీటరు కిరోసిన్‌పై రూ.36.83, వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.470.38లను చమురు సంస్థలు నష్టపోతున్నాయి. నష్టం ఇప్పటి మాదిరిగానే పెరుగుతూ ఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి మూడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రూ.1,56,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుందని అంచనా. గత నెల 30 చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రధానికి లేఖ రాస్తూ, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచకపోతే ఈ రెంటిపై ప్రభుత్వం అత్యధికంగా రూ.97,500 కోట్ల భారాన్ని భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
2012-13లో ఈ సంస్థలు కోల్పోయిన ఆదాయం రూ. 1,61,029 కోట్లు. ఇందులో సగానికి పైగా మొత్తాన్ని కేంద్రం నగదు సబ్సిడీ రూపంలో ఈ సంస్థలకు చెల్లించింది. లీటరు డీజిల్ ధర రూపాయి పెంచితే నష్టం రూ. 4,522 కోట్లు తగ్గుతుందని, రూ.3 పెంచితే నష్టం రూ. 13,565 కోట్లు తగ్గుతుందని పేర్కొన్నారు. ఒకేసారి రూ.5 పెంచితే నష్టం రూ.29,390 కోట్ల మేరకు తగ్గుతుందన్నారు. వంట గ్యాసు సిలిండర్‌పై రూ.50 పెంచితే వంట గ్యాసుపై నష్టం రూ.2,604 కోట్లు తగ్గుతుంది. అదేవిధంగా, లీటరు కిరోసిన్‌పై రూ.2 పెంచితే నష్టం రూ.1,014 కోట్లు తగ్గుతుందని పేర్కొన్నారు. డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్ ధరలను ఎప్పట్నుంచి డీజిల్ ధర పెంచాలనే విషయమై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.