
శిశువుల ఆరోగ్యం లాకెట్టులో!
‘ఖుషీ బేబీ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్న రాజస్థాన్
జైపూర్: పుట్టిన ప్రతి శిశువుకు టీకాలు వేయించడం ఇప్పుడు తప్పనిసరైపోయింది. ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధులు భవిష్యత్తులో వారికి హాని కలిగించకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఈ టీకాలు వేయిస్తుంటాం. అయితే ఏ టీకాలు వేశారు? మరే టీకాలు వేయాలి? అనే విషయంలో ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా అటు వైద్యులు, ఇటు తల్లిదండ్రులు పొరపడుతూనే ఉన్నారు. వేసిన టీకానే మళ్లీ వేయించడం, వేయించాల్సిన టీకా వేయించకపోవడం వంటి సంఘటనలు అంతటా జరుగుతూనే ఉన్నాయి.
కార్డులు, రికార్డుల్లో నమోదు చేసినా.. సమయానికి అవి దొరక్క ఏదో ఒక టీకా వేసి పంపేస్తున్న ఘటనలు కూడా పునరావృతమవుతున్నాయి. అయి తే ఈ సమస్యకు చక్కని పరిష్కారం కనుగొన్నారు రాజస్థాన్‌లోని జైపూర్ వైద్యాధికారులు. అదే ‘ఖుషీ బేబీ’. ఖుషీ బేబీ అనేది ఓ డిజిటల్ లాకెట్. టీకాల కార్యక్రమం మొదలు కాగానే పిల్లల మెడలో ఈ లాకెట్ వేస్తారు. టీకా కోసం ఆస్పత్రులకు వెళ్లినప్పుడు వేసిన టీకా వివరాలను ట్యాబ్ సాయంతో డిజిటల్ లాకెట్‌లో పొందుపరుస్తారు. దీంతో కార్డు పోగొట్టుకున్నామని, మర్చిపోయామని చెప్పడానికి అవకాశం లేదు. వేయాల్సిన టీకాపై స్పష్టత ఉంటుంది. అలాగే లాకెట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కూడా వైద్య విభాగం అధికారుల వద్ద ఉండే ట్యాబ్‌లో అందుబాటులో ఉంటుంది. ఒకవేళ లాకెట్‌లో ఏదైనా సమస్య వచ్చినా.. ట్యాబ్‌లోని సమాచారంతో టీకా వేస్తారు. ఓ రకంగా పిల్లల ఇమ్యునైజేషన్ ప్రక్రియను ఆన్‌లైన్ చేయడమన్నమాట. ఉదయ్‌పూర్‌లోని 81 ఆరోగ్య కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నారు.