
స్టాలిన్@65.. బహుమతిగా నల్లటి ఎద్దు
చెన్నై: తమిళనాడు డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ 65వ పడిలోకి అడుగుపెట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానుల మధ్య ఆయన తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కార్యకర్తలు పెద్ద మొత్తంలో బహుమతులు అందించారు. అందులో భారీ సంఖ్యలో పుస్తకాలు ఉండటంతోపాటు ఓ భారీ ఎద్దు కూడా ఉంది. ఎద్దును ఎందుకు బహుమతిగా ఇచ్చారంటే.. జల్లికట్టు నిర్వహించేలా ప్రభుత్వంపై ప్రజల పక్షాన తీవ్ర ఒత్తిడి చేసి విజయం సాధించినందుకు గుర్తుగా అందించినట్లు చెప్పారు.
ఎద్దు సామర్థ్యానికి గుర్తు అని, ప్రజా సమస్యల విషయంలో స్టాలిన్ కూడా ఎంతో సమర్థతతో ముందుకెళతారని అందుకే ఆయనకు ఇలాంటి బహుమతి ఇచ్చినట్లు చెప్పారు. డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో నల్లటి ఎద్దును దాని కొమ్ములకు డీఎంకే పార్టీ రంగులు వేసి చక్కగా అలంకరించి స్టాలిన్‌కు బహుమానంగా అందించారు. దీనిని అందుకుంటూ తనకు దక్కిన గొప్ప బహుమతి అంటూ స్టాలిన్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.