భారతీయులకు ఇష్టమైన టూరిస్ట్ ప్లేస్ ఏదో తెలుసా!
న్యూఢిల్లీ: భారతీయులు ఎక్కువ మంది విహార యాత్రకు వెళ్లాలనుకునే ప్రదేశం న్యూయార్క్ సిటీ. ఇటీవల జరిపిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడయింది. వరుసగా రెండో ఏడాదీ న్యూయార్క్ నగరమే తొలి స్థానంలో నిలిచిందని ఆ సంస్థ తెలిపింది. న్యూయార్క్ తర్వాత వరుసగా దుబాయి, లండన్ నగరాలు ఉన్నాయని పేర్కొంది. వీటితో పాటు ఇటీవలి కాలంలో అమ్‌స్టర్‌డామ్, ఎథెన్స్, మాలి లాంటి నగరాల్లో పర్యటించేందుకూ భారతీయ యాత్రికులు ఇష్టపడుతున్నట్లు వెల్లడయింది.
ఈ సర్వే గుర్తించిన మరిన్ని ఆసక్తికర విషయాలివీ... ఎక్కువ మంది భారతీయులు తమ యాత్రలను శుక్రవారం నాడు మొదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే పుణే, జైపూర్ వాసుల కంటే అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాల పర్యాటకులు సగటున ఎక్కువ రోజులు యాత్ర చేస్తున్నారు. అహ్మదాబాద్ ప్రాంతం వాసులు 11 రోజుల ట్రిప్ లకు వెళ్తుండగా.. హైదరాబాద్, ముంబై వాసులు సగటున 8 రోజులపాటు యాత్రల్లో గడుపుతున్నారు. కోల్‌కతా వాసులు నెల రోజులు ముందే తమ టూర్‌ప్లాన్ చేసుకుంటూ దేశంలోనే మిగతా ప్రాంతాల వారి కంటే అడ్వాన్సుగా ఉంటున్నారని కాయక్ కంట్రీ మేనేజర్(ఇండియా) అభిజిత్ మిశ్రా తెలిపారు.