కోల్‌కతా : కడు పేదరికం. లేకలేక పుట్టిన బిడ్డ. తెలియని వింత రోగం బిడ్డను వేధిస్తుండటంతో పెద్దాసుపత్రిని ఆశ్రయించింది జోత్స్న, జ్యోంతు దాస్‌ల జంట. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బిడ్డకు పుట్టుకతో వచ్చే ఎన్‌సీఫలోసీల్ అనే వ్యాధి సోకినట్లు చెప్పారు. అందుకే బిడ్డ తల ఫ్లాట్‌గా తయారైందని, మెడ వెనుక భాగంలో కణితి ఏర్పడిందని వివరించారు.
ఏం చేసినా బిడ్డను బ్రతికించలేమని తల్లిదండ్రులకు చెప్పారు. డాక్టర్ల మాటలు విన్న 'బాబు' తల్లి జోత్స్న అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. లేకలేక పుట్టిన బిడ్డకు రెండు నెలలలోనే నూరేళ్లు నిండిపోతాయని తెలిసి గుండెలు అవిసేలా ఏడ్చింది. గర్భవతిగా ఉన్న సమయంలో పలుమార్లు స్కానింగ్ చేయించామని అప్పుడు సమస్య ఉన్నట్లు రిపోర్టుల్లో రాలేదని ఆమె తెలిపారు.
బాధను పంటిబిగువన అదిమి పెట్టి ప్రేమతో తన బిడ్డను బ్రతికించుకుంటామని చెప్పి 'బాబు'ను ఇంటికి తీసుకెళ్లింది జంట. అప్పటినుంచి కంటి రెప్పలా బిడ్డను కాపాడుకుంటూ వస్తున్నారు ఆ తల్లిదండ్రులు. వైద్య శాస్త్రంలో ఎన్నో మిరాకిల్స్ జరిగాయని, అలాంటిదే తమ బిడ్డకు జరిగి నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్లు జోత్స్న, దాస్ దంపతులు చెప్పారు.
'ఎన్‌సీఫలోసీల్' అంటే ఏంటి?
అత్యంత అరుదుగా బ్రెయిన్‌కు సోకే వ్యాధే ఎన్‌సీఫలోసిల్. న్యూరల్ ట్యూబ్‌లోని లోపాల కారణంగా బిడ్డ జన్మించే క్రమంలో ఈ వ్యాధి సోకుతుంది. తల్లి గర్భం దాల్చిన మూడు, నాలుగు వారాల్లో బిడ్డ మెదడు, వెన్నుపూస తయారవుతుంది.
ఈ సమయంలో న్యూరల్ ట్యూబ్ సరిగా మూసుకోకపోవడం వల్ల ఎన్‌సీఫలోసీల్ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి బిడ్డ ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment