
కాలినడక శబరిమల వెళుతున్న స్వాములు, వారి వెంట నడుస్తున్న శునకం
బెంగళూరు : శబరిమల ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఇప్పటికే ఇరుముడి కట్టుకున్న వేలాదిమంది భక్తులు ఆలయానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఓ కుక్క వార్తల్లో నిలిచింది. భక్తుల వెంట శబరిమలకు పయనమైన కుక్క గురించి తెలిసినవారంతా దాని భక్తికి ఔరా అంటున్నారు. మరి అలుపు లేకుండా వందల కిలోమీటర్లు నడక సాగించిన శునకం దివ్యక్షేత్రానికి చేరుకుంటుందో లేదో చూడాలి.
వివరాలు.. తిరుమల నుంచి 13మంది భక్తులు అయ్యప్ప క్షేత్రానికి తరలి వెళ్లాలనుకున్నారు. అక్టోబర్ 31న తిరుమల నుంచి కాలి నడక ప్రారంభించారు. వీరి వెంట ఓ శునకం కూడా నడక ప్రారంభించింది. అయితే తమ వెంట కుక్క వస్తున్న విషయాన్ని వారు గమనించలేదు. కానీ వెనక్కు చూసిన ప్రతీసారి కుక్క ఉండటంతో వారి కళ్లను నమ్మలేకపోయారు. అలా స్వాములతో కలిసి కుక్క 480 కిలోమీటర్లు ప్రయాణించింది. స్వాములు ప్రతినిత్యం వారు తెచ్చుకున్నదాంట్లో కొంత ఆ కుక్కకు పెడుతూ దాని ఆకలి తీరుస్తూ వచ్చారు. సుధీర్ఘ ప్రయాణం అనంతరం వారు నవంబర్ 17న కర్ణాటకలోని కొట్టిగెరాకు చేరుకున్నారు.
తాము ప్రతి సంవత్సరం కాలినడకన శబరిమల వెళ్తామని, ఈ సంవత్సరం తమతో పాటు ఓ కుక్క శబరిమలకు ప్రయాణం అవ్వటం మర్చిపోలేనిదని స్వాములు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శునక భక్తిని మెచ్చిన నెటిజన్లు దాన్ని వేనోళ్ల కొనియాడుతున్నారు. అనేక మంది భక్తుల మనసులను అది గెలుచుకుంది అనడానికి వారు చేస్తున్న కామెంట్లే నిదర్శనం. కాగా రెండు నెలల తర్వాత ఆదివారం శబరిమల ఆలయం తెరుచుకోగా మొదటిరోజే యాభైవేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.