న్యూఢిల్లీ : దాదాపు రెండు నెలల తర్వాత పలు దేశీయ విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభమయిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌లకు చేరకున్న ప్రయాణికుల్లో కొందరికి నిరాశే మిగిలింది. దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టుగా కేంద్రం ప్రకటించిగానే పలువురు ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లకు క్యూ కట్టారు.
అయితే ముందుగా ప్రకటించిన పలు సర్వీసులు రద్దు కావడంతో.. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలోనే నిరీక్షిస్తున్నారు. చాలా ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సర్వీసులు రద్దు కావడంతో.. గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో సహా దేశంలోని పలు ఎయిర్‌పోర్ట్‌లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు నిలిచిపోయారు. విమాన సర్వీసులు పునరుద్దరించబడ్డ తొలి రోజే ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి 80 సర్వీసులను రద్దు చేసినట్టుగా సమాచారం. మరోవైపు హైదరాబాద్ నుంచి ముంబై, ఛండీగఢ్, విశాఖపట్నం, తిరుపతి, నాందేడ్, బెంగళూరు, కడప, పుణె, త్రివేండ్రం, గోవా, కోయంబత్తూరులకు వెళ్లే విమానాలను రద్దు చేశారు. కాగా, పలు రాష్ట్రాలు పరిమిత సంఖ్యలో మాత్రమే విమాన సర్వీసులకు అనుమతించడం, 14 రోజులపాటు క్వారంటైన్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
మరోవైపు విమాన సర్వీసులు పున: ప్రారంభం కావడంతో ఎయిర్‌పోర్ట్‌ల వద్ద ప్రయాణికులు సందడి నెలకొంది. ఇప్పటికే పలువురు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. పలు చోట్ల ఎయిర్‌పోర్ట్‌లకు చేరకున్న ప్రయాణికుల చేతుల మీద హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు. తెలంగాణ విషయానికి వస్తే.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment