'దాడులొద్దు.. నన్ను అరెస్టు చేసి కక్ష తీర్చుకోండి'
కోల్‌కతా: ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం కాదని, అలా చేయొద్దని ఒకేసారి తనను అరెస్టు చేసి వారికున్న రాజకీయ కక్ష మొత్తం తీర్చుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలే దేవుళ్లు అని, వారు ఉన్నారు కాబట్టే నేడు ప్రధాని నరేంద్రమోదీ అయినా, దేశమైనా ఉందని సవాల్ చేసి చెబుతున్నానన్నారు. అలాగే, తమిళనాడు సీఎస్ రామమోహన రావు ఇంటిపై ఐటీ దాడులు జరిగిన తీరును ఆమె తప్పుబట్టారు. ఒక రాష్ట్రంలోని అధికారి అవినీతికి పాల్పడితే కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాలని చెప్పారు.
కానీ, వాళ్లు అలా చేయలేదని, తమిళనాడు సీఎస్ ఇంటిపై దాడులు జరిగిన తీరు రాజ్యాంగ విరుద్ధం అని ఆమె అన్నారు. ఇలాంటి కేంద్రం చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. 'గతంలో కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చీఫ్ సెక్రటరీపై కూడా ఇలాగే దాడులు చేసి వేధించారు. ఎందుకు నైతిక విలువలు పక్కకు పెట్టి ప్రవర్తిస్తున్నారు? సాంకేతికంగా ఎందుకు వెళ్లడం లేదు. ఇదంతా సమాఖ్య విధానానికి భంగం కలిగించడమే.
ఎందుకు వారంతా అమిత్ షా లాంటివారి ఇళ్లపై దాడులు చేయడం లేదు. అవినీతి ప్రతిఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందే. అయితే, కేంద్ర సంస్థలు మాత్రం విలువలు పాటించి సివిల్ సర్వీసెస్ ను కూడా అవమానిస్తున్నాయి. తగిన కార్యాచరణ లేకుండా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వాన్ని తప్పకుండా విశ్వాసంలోకి తీసుకొని, అతడిని పదవిలో నుంచి తొలగించి లభించిన సమాచారం ప్రకారం చర్యలు తీసుకోవాలి. అంతేగానీ ఇలా చేయకూడదు' అంటూ మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.