జమ్మూ: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో మత ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర వైఖరితో దేశం మరిన్ని ముక్కలయ్యే అవకాశముందని హెచ్చరించారు.
‘మీరు ఇప్పటికే ఒక పాకిస్థాన్‌ను సృష్టించారు. ఇంకా ఎన్ని పాకిస్థాన్‌లు సృష్టిస్తారు. భారత్‌ను ఎన్ని ముక్కలు చేస్తారు’ అని శనివారం జమ్మూలో జరిగిన ఒక ర్యాలీలో పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్‌దే అంటూ గతవారం తాను వ్యాఖ్యలను ఫరూఖ్ సమర్థించుకున్నారు. ’ఔను! పీవోకే పాక్‌దేనని నేను అన్నాను. వారు (పాక్) ఏమైనా గాజులు తొడుక్కునారా? వాళ్ల వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయి. మేం చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా?’ అని ఫరూఖ్ అన్నారు. ’మీరు ప్యాలెస్‌లలో నివసిస్తున్నారు. సరిహద్దుల్లో నివసిస్తున్న పేదవారి గురించి ఆలోచించండి. నిత్యం వారు బాంబు దాడులు ఎదుర్కొంటున్నారు’ అని పేర్కొన్నారు.
పీవోకేను భారత్ ఆక్రమించుకునే అవకాశం ఇచ్చేంత బలహీన దేశం పాక్ కాదని ఫరూఖ్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘ఇంకా ఎంత కాలం పీవోకే మనదేనని ఈ దేశం చెప్పుకుంటూ ఉంటుంది? అది వీళ్ల అబ్బ సొత్తేమీ కాదు. పీవోకే పాకిస్తాన్‌దే. జమ్మూ కశ్మీర్ భారత్‌ది. 70 ఏళ్లయినా పీవోకేను భారత్ తన అధీనంలోకి తెచ్చుకోలేకపోయింది. కానీ స్వాధీనం చేసుకుంటామని చెబుతూనే ఉంది. ఇది ఎలా జరగుతుందో మేమూ చూస్తాం. పాకిస్తాన్ ఏమీ బలహీన దేశం కాదు. వాళ్లు గాజులు తొడుక్కోలేదు. వాళ్ల దగ్గరా అణుబాంబులు ఉన్నాయి. యుద్ధం గురించి ఆలోచించేముందు మనుషులుగా బతకడం గురించి ఆలోచించాలి’ అని ఫరూఖ్ గతంలో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment