పప్పుధాన్యాలపై స్థానిక పన్నులొద్దు
రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన కేంద్రం
న్యూఢిల్లీ: పప్పుధాన్యాలపై స్థానిక పన్నులేవీ విధించొద్దని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నిత్యావసర వస్తువులు, నూనె ధరలపై కేంద్ర ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ శనివారం మీడియాతో మాట్లాడారు. రానున్న నెలల్లో పప్పుధాన్యాలపై ధరలు పెరగనున్నాయన్న ఆందోళనల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు లెవీ టాక్స్, మార్కెట్ ఫీజు, వ్యాట్ వంటి స్థానిక పన్నులను వాటిపై వేయవద్దని కోరారు. ప్రస్తుతం 1.5 లక్షల టన్నుల పప్పుధాన్యాల నిల్వలున్నాయని వీటిని 9 లక్షల టన్నులకు పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
స్థానిక పన్ను మినహాయింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు సొంత ధరల స్థిరీకరణ నిధులను నిత్యావసర, పప్పుదాన్యాల ధరలను తనిఖీ చేసుకునేందుకు ఉపయోగించుకోవాలన్నారు. పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునే వారు, మిల్లర్లు, వ్యాపారులు, ఉత్పత్తి దారులకు పప్పు ధాన్యాల నిల్వ స్థాయుల్ని నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. పప్పుధాన్యాల ఉత్పత్తి 17 మిలియన్ టన్నులుంటే వినియోగం మాత్రం 23.6 మిలియన్ టన్నులుందని మంత్రి తెలిపారు.
3 రాష్ట్రాలకు అదనపు ఆహారధాన్యాలందిస్తాం: కేంద్రం
కరువుతో సతమతమవుతున్న మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు అదనపు ఆహారధాన్యాలను సమకూర్చడంతో పాటు, ఆ రాష్ట్రాల్లోని రేషన్ కార్డుల్లేని వారికీ ఆహార ధాన్యాలని అందించేందుకు కేంద్రం సమ్మతించింది. ఇంకే రాష్ట్రానికైనా ఆహార ధాన్యాలు కొరత ఉంటే ప్రతిపాదనలు పంపమని తెలిపింది. ఎన్జీవో స్వరాజ్ అభియన్ పిటిషన్ మేరకు సుప్రీం కోర్టు కరువు రాష్ట్రాలకు అదనపు ఆహారధాన్యాలని ఇవ్వాలని కేంద్రానికి గతవారమే సూచించింది.