న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న భారతదేశాన్ని 2022 కల్లా సాకారం చేసేందుకు కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం యువ ఐఏఎస్ అధికారులకు పిలుపునిచ్చారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ...జీఎస్టీ అమలు, డిజిటల్ లావాదేవీల పెంపు (ప్రత్యేకించి భీమ్ యాప్ ద్వారా) తదితరాలపై దృష్టి పెట్టాలని వారిని కోరారు.
దేశం, పౌరుల సంక్షేమమే పరమావధిగా పని చేయడం నేడు అధికారుల ప్రధాన విధి అని మోదీ పేర్కొన్నారు. బృంద స్ఫూర్తితో పనిచేయాలనీ, పనిపై ఎక్కడకు వెళ్లినా బృందంగానే వెళ్లాలని యువ అధికారులకు మోదీ సూచించారు. సుపరిపాలన, అందరికీ ఆర్థిక సేవలు, గ్రామీణ ఆదాయం పెంపు, డేటా చోదక గ్రామీణాభివృద్ధి, పురాతత్వ ప్రదేశాల పర్యాటకం, రైల్వే భద్రత తదితర అంశాలపై యువ అధికారులు మోదీకి ప్రజెంటేషన్ ఇచ్చారు.