లక్షన్నర గ్రామాల్లో కరువు | Drought Has Affected One-Fourth Of Country, Says Government | Sakshi
Sakshi News home page

లక్షన్నర గ్రామాల్లో కరువు

Published Wed, May 11 2016 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

లక్షన్నర గ్రామాల్లో కరువు

లక్షన్నర గ్రామాల్లో కరువు

నాలుగో వంతు జనాభాపై ప్రభావం
* లోక్‌సభలో కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ: దేశ జనాభాలో నాలుగో వంతు మందిపై కరువు ప్రభావం చూపిందని.. 1.5 లక్షల గ్రామాలు కరువు పీడితమయ్యాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో.. నదుల అనుసంధానం వంటి వివాదాస్పద అంశాలపై ఏకాభిప్రాయం అవసరమని లోక్‌సభలో అన్ని పక్షాలనూ కోరింది. కరువు, నీటి కొరత, నదుల అనుసంధానం అంశాలపై మంగళవారం లోక్‌సభలో చర్చ జరిగింది.  పలువురు సభ్యులు పరిస్థితి విషమిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తాగునీటి కొరతతో ప్రజలు బాధలు పడకుండా ఉండేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు.

కాంగ్రెస్ సభ్యుల నినాదాలు, గందరగోళం మధ్య.. గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్‌సింగ్ చర్చకు సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 313 జిల్లాలు, 1,58,205 గ్రామాలు, 4,44,280 జనావాసాలు కరువుబారిన పడ్డాయని చెప్పారు. కరువు కన్నా చాలా ముందుగానే.. ఆంధ్రప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాలకు రూ. 1,360 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ‘నిధుల కొరత లేదు. కరువు ప్రభావిత రాష్ట్రాలకు మేం ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా ఇప్పటికే రూ. 564 కోట్లు ఇచ్చాం.

భాగస్వామ్యం విధానం ప్రకారం రాష్ట్రాలు 50 శాతం వాటా ఇవ్వాలి. రాష్ట్రాలకు రూ. 1,900 కోట్లు పంపించాం. అంటే.. ఈ పరిస్థితిని ఎదుర్కొనటానికి రాష్ట్రాల వద్ద రూ. 3,800 కోట్లు ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ‘‘9.33 లక్షల చేతి పంపులను పునరుద్ధరించటం, మరమ్మతు చేయటం జరిగింది. 14,80,000 రైజర్ పంపులను మార్చడమో లేదా పొడిగించడమో చేశారు. 27,728 కొత్త బోరుబావులను తవ్వారు. ఉపాధి హామీ పథకం నిధులను రూ. 37,000 కోట్ల నుంచి రూ. 45,000 కోట్లకు పెంచాం.. పని దినాలను కూడా 252 రోజులకు పెంచాం’ అని వివరించారు.

ఈ సందర్భంగా మంత్రికి, కాంగ్రెస్ సభ్యులకు మధ్య పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకుంది. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీరేందర్‌సింగ్.. ఆ పార్టీ గురించి తనకు అన్నీ తెలుసునని, తన నోరు తెరిచే పరిస్థితికి నెట్టవద్దని ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి అన్నారు.   
 
లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుల ధర్నా
అగస్టా హెలికాప్టర్ల స్కాంకు సంబంధించి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీపై ప్రధానమంత్రి మోదీ ఎన్నికల సభలో చేసిన ఆరోపణలు సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయంటూ పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆ పార్టీ నోటీసులు ఇచ్చింది. పార్లమెంటు లోపలా వెలుపలా అవినీతిపై మాట్లాడే హక్కు ప్రధానికి ఉందని ఆర్థిక మంత్రిజైట్లీ రాజ్యసభలో ఉద్ఘాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement