
తాగునీరు అందించలేకుంటే ప్రభుత్వాల వల్ల ఉపయోగమేంటి?
లోక్‌సభలో కరువుపై చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: పౌరులకు తాగునీటిని అందించలేకపోతే ప్రభుత్వాలవల్ల ఉపయోగమేమిటని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి నిలదీశారు. ప్రజలందరికీ తాగునీటిని అందించడం మొట్టమొదటి ప్రాధాన్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలో కరువు పరిస్థితులపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో మేకపాటి మాట్లాడుతూ.. ఏటా వేసవిలో తాగునీటి ఎద్దడి పరిస్థితి ఎదురవుతోం దని, అందువల్ల శాశ్వత పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
దేశంలో పలు నదులున్నా అధికంగా నీరు సముద్రంలో కలుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో నదుల అనుసంధానానికి యోచిం చాల్సిన సమయం ఆసన్నమైందంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి గోదావరి, కృష్ణా నదులను కలిపేవిధంగా పోలవరం ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తు చేశారు.