సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు మార్చి 5వ తేదీ వరకూ వాయిదా పడ్డాయి. ఏపీకి ప్రత్యేక హోదాపై ఇవాళ కూడా లోక్‌సభలో నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీలు శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. విభజన చట్టం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాలకు సహకరించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ విజ్ఞప్తి చేసినా, పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో స్పీకర్ సభను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేశారు. దీంతో బడ్జెట్ మొదటి దశ సమావేశాలు పూర్తి అయ్యాయి. మరోవైపు రాజ్యసభలోనూ విపక్షాల నిరసనలు, నినాదాలతో సభ మధ్యాహ్నం 2.30 గంటల వరకూ వాయిదా పడింది.
పోరాటం కొనసాగుతుంది..
లోక్‌సభ వాయిదా అనంతరం వైఎస్‌ఆర్ సీపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ...ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కడప స్టీల్‌ప్లాంట్, పోలవరం, దుగరాజపట్నం పోర్టు నిర్మాణంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని అన్నారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగంలో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని, హోదా అయిదు కోట్లమంది ప్రజల ఆకాంక్ష అని అన్నారు. తన స్వార్థం కోసం ప్రత్యేకహోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రజలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని, విభజన హామీలు అమలయ్యే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు..
తన స్వార్థం కోసం చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని, ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని అన్నారు. విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు ఇప్పుడు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మరన్నారు. హోదా సాధించేవరకూ తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ, విభజన హామీలన్నీ అమలు చేయాలని ఎంపీ మేకపాటి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment