ఆ ఖర్చులో ఎన్‌డీఏ టాప్..
ఆ ఖర్చులో ఎన్‌డీఏ టాప్..
Published Thu, Aug 31 2017 2:43 PM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM
సాక్షి, న్యూఢిల్లీః గత మూడేళ్లలో ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాలో ప్రకటనలపై రోజుకు సగటున వెచ్చించిన వ్యయం యూపీఏ ప్రభుత్వంతో పోల్చితే రెండింతలుగా ఉంది. గత మూడేళ్లలో ఎన్‌డీఏ సర్కార్ ప్రకటనల కోసం రూ 3214 కోట్లు ఖర్చు చేసింది. ఇది సగటున రోజుకు రూ 3.21 కోట్లుగా నమోదైంది. అయితే పదేళ్ల కాలంలో యూపీఏ సర్కార్ ప్రకటనలపై రూ 2658 కోట్లు ఖర్చు చేసి రోజుకు సగటున రూ 1.45 కోట్లు వెచ్చించింది. సమాచార హక్కు కింద ఈ వివరాలు వెల్లడయ్యాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్ తన తొలి వేయి రోజుల పాలనలో రూ 3529 కోట్లు ప్రచారంపై ఖర్చు చేసిందని ఆర్‌టీఐ కింద పిటిషన్ దాఖలు చేసిన సామాజిక కార్యకర్త అర్జున్ పర్మార్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియాపై గత మూడేళ్లలో రూ 1585 కోట్లు ఖర్చు చేసింది. ఇది యూపీఏ సర్కార్‌తో పోలిస్తే 80 శాతం అధికం కావడం గమనార్హం.
ప్రింట్ మీడియాపై కేంద్రం గడిచిన మూడేళ్లలో రూ 1630 కోట్లు ఖర్చు చేసింది. ఇది యూపీఏ పదేళ్ల పాలనలో చేసిన ఖర్చుపై 50 శాతం అధికం. ఇక అవుట్‌డోర్ పబ్లిసిటీ లోనూ ఎన్‌డీఏ ప్రభుత్వం భారీగానే వెచ్చించింది. యూపీఏ పదేళ్ల హయాంలో అవుట్‌డోర్ ప్రచారంపై రూ 202 కోట్లు ఖర్చు చేయగా, ఎన్‌డీఏ ప్రభుత్వం మూడేళ్లలోనే రూ 315 కోట్లు ఖర్చు చేసింది.
Advertisement