
పాక్ తీరుపై మండిపడ్డ సుష్మా స్వరాజ్
బీజింగ్ : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్ చేపట్టిన మెరుపుదాడులు కేవలం ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాద మౌలిక వసుతలను ధ్వంసం చేసే లక్ష్యంతోనే సాగాయని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. సైనిక స్ధావరాలు లక్ష్యంగా ఎలాంటి దాడి జరగలేదని చెప్పారు. భారత్‌లో జైషే మహ్మద్ మరో దాడికి సన్నద్ధమవుతున్నదన్న నేపథ్యంలో అలాంటి పరిస్థితి చోటుచేసుకోరాదన్నదే భాతర అభిమతమని, తాము బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు.
జైషే ఆగడాలపై సవివర ఆధారాలతో తాము పాకిస్తాన్‌కు నివేదించినా పాకిస్తాన్ ఉగ్ర దాడులపై తమకేమీ తెలియనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజింగ్‌లో భారత్, చైనా, రష్యా విదేశాంగ మంత్రుల భేటీలో ఆమె పాల్గొన్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం జైషే మహ్మద్, ఇతర ఉగ్ర సంస్థలపై అంతర్జాతీయ సమాజం పిలుపు మేరకు కఠినంగా వ్యవహరించాల్సిన పాకిస్తాన్ దాడిపై తమకు ఎలాంటి సమాచారం లేదని పాక్ నిరాకరించిందని, దాడికి పాల్పడినట్టు జైషే వెల్లడించడాన్నీ విస్మరించిందని సుష్మా ఆక్షేపించారు.