అనారోగ్యం వల్లో లేదా రోడ్డు ప్రమాదం కారణంగానో కొందరు వీల్‌చైర్‌కే పరిమితం అయిపోతుంటారు. అలాంటి వారిని బయటకు తీసుకెళ్లాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. మిగతా వాళ్లలాగా తాము అన్నిచోట్లకూ వెళ్లలేకపోతున్నామని, నాలుగు గోడల మధ్య బందీలుగా మారిపోయామని మానసికంగానూ వారు కుంగిపోతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపుతోంది ‘ఈజీ మూవ్’. వీల్‌చైర్‌కే పరిమితమైన రోగులను అవసరమైన చోటుకు సులభంగా తీసుకెళ్లేందుకు వీల్‌చైర్ ట్యాక్సీలను ఈ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ముంబైలో ఇప్పటికే ఈ ట్యాక్సీలు సేవలందిస్తున్నాయి. ఇప్పటివరకు 7 వేల మంది ఈ సేవలను ఉపయోగించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఎలా మొదలైంది...?
ఢిల్లీలో 2015లో జరిగిన వికలాంగుల 15వ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్న వారికి వీల్‌చైర్ లిఫ్ట్‌లు, ర్యాంపులు అందుబాటులో లేవు. నిర్వాహకులు మెట్లపై ప్లైవుడ్‌ను మాత్రమే పరిచారు. ఇది ఈజీ
మూవ్ సంస్థ కో–ఫౌండర్ రోమియో రవ్వను కదిలించింది. వీల్‌చైర్‌కే పరిమితమైన తన స్నేహితుడి చెల్లెలు ఇతరులకు ఇబ్బంది లేకుండా, ఎవరిపైనా ఆధారపడకుండా కాలేజీకి వెళ్లిరావడం చూశారు. మిగతా వాళ్లకూ ఇలాంటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మరో ఇద్దరితో కలసి ‘ఈజీ మూవ్’ను నెలకొల్పారు. కదలలేని స్థితిలో ఉన్న వాళ్లు గౌరవంగా, హుందాగా అనుకున్న చోటుకు వెళ్లేలా సేవలందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు.
ఎలాంటి సేవలందిస్తారు...?
వీల్‌చైర్‌కే పరిమితమైన రోగులను తరలించేందుకు కార్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా వీల్‌చైర్‌తో సహా కారులోకి వెళ్లిపోవచ్చు. భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కారులో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. డ్రైవర్‌కు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. రోగిని కారులోకి భద్రంగా చేర్చడంతోపాటు అవసరమైన సేవలు అందిస్తారు. ఆసుపత్రి, ఎయిర్‌పోర్టుకు వెళ్లి రావడం, ఆలయాలు, పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు తీసుకెళ్తారు. సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లాలన్నా ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ముంబైలో అందుబాటులో ఉన్న వీల్‌చైర్ ట్యాక్సీ సర్వీసును త్వరలో గోవాలోనూ ప్రారంభించనున్నారు. 2019 నాటికి దేశంలోని అన్ని మెట్రో నగరాలకు ఈ సర్వీసును విస్తరింపజేయాలని సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.
చార్జీ ఎంత...?
ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు బేసిక్ చార్జీ (4 కి.మీ వరకు) రూ. 250గా ఉంది. ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ. 30 వసూలు చేస్తారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రూ. 350 బేసిక్ చార్జీ, ప్రతి కిలోమీటర్‌కు అదనంగా రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు, ఎనిమిది గంటల అద్దెకు కూడా లభిస్తాయి. సొంతకారు ఉన్న వారు తమ కారులో కూడా మార్పులు చేసుకోవాలంటే ఆ సదుపాయమూ ఇక్కడ అందుబాటులో ఉంది. వృద్ధులు, ప్రత్యేక అవసరాలుగల వారు సులభంగా ప్రయాణించేలా కారులో మార్పులు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment