చండీగఢ్ : పిల్లలను ప్రచారంలో భాగస్వామ్యం చేశారన్న కారణంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ ఖేర్‌కు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ నటి, చండీగఢ్ సిట్టింగ్ ఎంపీ కిరణ్ ఖేర్ ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పిల్లలతో ఆమె మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ కిరణ్ ఖేర్‌కు ఓటు వేయండి. మరోసారి మోదీ సర్కారు’ అంటూ పిల్లలు నినాదాలు చేస్తున్నట్లు ఉండటం పట్ల జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో 24 గంటల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ కిరణ్ ఖేర్‌కు శనివారం నోటీసులు జారీ చేసింది. ఇక లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మే 19న చండీగఢ్‌లో ఎన్నికలు జరుగునున్నాయి.
కాగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పిల్లలను వాడుకుంటున్నారంటూ జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాహుల్‌కు మద్దతు తెలుపుతూ.. మోదీ గురించి పిల్లలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఈ వీడియోలో ప్రియాంక గాంధీ నవ్వుతూ కనిపించారంటూ బీజేపీ విమర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ఆమెకు నోటీసులు జారీ కాగా.. ‘ పిల్లలు తమంతట తాము ఆడుకుంటున్నారు. నేను వారిని కలవడానికి దగ్గరికి వెళ్లగానే నినాదాలు చేశారు. కొన్ని తప్పుడు నినాదాలు ఇవ్వగానే అలా మాట్లాడవద్దని చెప్పాను’ ఆమె వివరణ ఇచ్చారు. కాగా బాంబే హైకోర్టు 2014లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం పిల్లలను ఎన్నికల ప్రచారంలో వాడుకోకూడదు.
Comments
Please login to add a commentAdd a comment