ముంబై : నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని పీఠం అలంకరిస్తారని బీజేపీ మిత్రపక్షం శివసేన ధీమా వ్యక్తం చేసింది. మంగళవారం తన అధికార పత్రిక సామ్నాలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకల మీద కూడా ప్రశంసలు కురిపించింది. ‘ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయనే విషయం మాకు అనవసరం. ప్రజల ఉత్సాహం చూస్తూంటే నరేంద్ర మోదీనే మరోసారి ప్రధాని అవుతారనే నమ్మకం కల్గుతుంది. ఇక పోతే ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక చాలా కష్ట పడ్డారు. వారి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఈ సారి పార్లమెంట్‌లో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేద’ని శివసేన పేర్కొంది.
అంతేకాక ‘2014లో కాంగ్రెస్‌కు సరిపడా సీట్లు లభించకపోవడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఈసారి తప్పకుండా ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నుంచే ఉండబోతున్నారు. దీన్ని రాహుల్ విజయంగానే చెప్పుకోవాలి’ అని శివసేన అభిప్రాయపడింది. ఏడో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు స్పష్టమైన ఆధిక్యతను కట్టబెట్టాయి. తరువాతి స్థానం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు దక్కనున్నట్లు సర్వేలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో జట్టుకట్టిన శివసేన పరోక్షంగా కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని చెబుతూనే ఆ పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిలవబోతోందని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment