
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ఈ వారంలో వెలువడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతోపాటే ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను దాదాపుగా ఖరారు చేసింది. ఈ నెల 7, 8 తేదీల్లో షెడ్యూల్ వెలువడుతుం దని సమాచారం. ఏ కారణంతోనైనా వాయిదా పడితే 11, 12 తేదీల్లో కచ్చితంగా షెడ్యూల్ వెలువడుతుందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ఈ తేదీల్లో ఎప్పుడు వచ్చినా మొదటి దశ నోటిఫికేషన్ ఈ నెల 18న వెలువడుతుందని ఆ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఆరు లేదా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది.
ఎన్నికల ప్రక్రియ మే 21లోగా పూర్తి చేసేందుకు వీలుగా షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించింది. జమ్మూకశ్మీర్‌లో శాసనసభకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా, శాంతిభద్రతల దృష్ట్యా ఇప్పుడే నిర్వహించే అవకాశం లేదని తెలుస్తోంది. అత్యున్నత వర్గాలిచ్చిన సమాచారం ప్రకారం లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 13–17 తేదీల మధ్య ఉండొచ్చు.
తదుపరి దశల ఎన్నికలకు మధ్య గడువు 5 నుంచి ఏడు రోజులుండే అవకాశముం ది. రెండు దశల మధ్య వారంరోజుల వ్యవధి తీసుకుంటే ఓట్ల లెక్కింపు మే 21–25 తేదీల మధ్య ఉంటుందని, ఐదు రోజుల సమయం తీసుకుంటే మే 15వ తేదీ నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఈసీ వర్గాలు తెలియజేశాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలతో పాటు తెలంగాణలో మొదటి దశలోనే పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment