ప్రధానితో అళగిరి భేటీ
న్యూఢిల్లీ: డీఎంకే నుంచి సస్పెండైన ఎంపీ, కరుణానిధి కుమారుడు ఎం.కె.అళగిరి గురువారం ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. అయితే తాను కేవలం మర్యాదపూర్వకంగానే ఆయనతో సమావేశమయ్యానని భేటీ అనంతరం విలేకరులతో అన్నారు. మీరు కొత్త పార్టీ పెట్టనున్నారా అని ప్రశ్నించగా.. తన మద్దతుదారులను సంప్రదించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమన్నారు. కాగా, ఆయన కొత్త పార్టీ పెట్టడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. దీనిపై స్పందించడానికి అళగిరి తమ్ముడు స్టాలిన్ నిరాకరించారు. ఇలాంటి అనవసర వార్తలను తాను చదవనని, చర్చించనని అన్నారు.
గుజరాత్‌లో ఒక స్థానం నుంచి మోడీ పోటీ
అహ్మదాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్‌లోని ఒక స్థానం నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ గుజరాత్ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి విజయ్ రూపానీ గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. మోడీ గుజరాత్‌లో ఒక స్థానం నుంచి పోటీ చేసేది ఖాయమని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి కూడా మోడీ పోటీ చేసే అవకాశాన్ని ఆయన తోసిపుచ్చలేదు. రాష్ట్రం నుంచి మోడీ తప్పక పోటీచేయాలని కార్యకర్తల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని రూపానీ తెలిపారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని ఒక స్థానం నుంచి మోడీ పోటీ చేయాలని తమ(రాష్ట్ర బీజేపీ) పార్లమెంటరీ బోర్డు ఖరారు చేసిందని వివరించారు. అయితే ఏ స్థానం నుంచి మోడీ పోటీ చేసేదీ నిర్ణయించలేదన్నారు. యూపీలోని వారణాసి నుంచి కూడా మోడీ పోటీ చేసే అవకాశముందా? అని ప్రశ్నించగా.. ఆ స్థానం గురించి తనకేమీ తెలియదని రూపానీ బదులిచ్చారు.
శ్రీరాములుకు బీజేపీ టికెట్
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: సీనియర్ నేత సుష్మాస్వరాజ్ వ్యతిరేకించిన నేపథ్యంలో.. కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు నాయకత్వంలోని బీఎస్‌ఆర్‌సీపీని విలీనం చేసుకోరాదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. అదే సమయంలో ఆయన్ను బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసేందుకు ఆమోదం తెలిపింది. గురువారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీఎస్‌ఆర్‌సీపీ విలీనం అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. బీఎస్‌ఆర్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవడానికి సమావేశంలో అయిష్టత వ్యక్తమైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే శ్రీరాములును బళ్లారి నుంచి పోటీకి దింపేందుకు మాత్రం ఆమోదం లభించడం విశేషం. శ్రీరాములును బళ్లారి నుంచి పార్టీ టికెట్‌పై బరిలోకి దింపాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించినట్టు పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి తెలిపారు. శ్రీరాములు ఈ నెల 14న లాంఛనంగా బీజేపీలో చేరతారు.
యూఐడీఏఐకి నీలేకని రాజీనామా
బెంగళూరు: ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చైర్మన్ నందన్ నీలేకని గురువారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సమర్పించినట్టు ఆయన చెప్పారు. నీలేకని బెంగళూరు దక్షిణ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. బీజేపీ తరఫున ఐదుసార్లు ఎంపీగా గెలిచిన అనంతకుమార్‌తో ఆయన తలపడుతున్నారు.
పరిశీలకులుగా 700 మంది ఐఆర్‌ఎస్‌లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రచార వ్యయం ఎక్కువగా ఉండొచ్చని గుర్తించిన నియోజకవర్గాల్లో పరిశీలకులుగా 700 మంది ఐఆర్‌ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్) అధికారులను ఎన్నికల కమిషన్ నియమించనుంది. తగిన అధికారుల పేర్లతో జాబితాను ఖరారు చేసి పంపాలని కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డును ఆదేశించిది.
ఎలక్షన్ వాచ్
Published Fri, Mar 14 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM
Advertisement
Advertisement