న్యూఢిల్లీ: రాజ్యసభలోని 10 స్థానాలకు ఆగస్టు 8వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజ్యసభ సభ్యులైన కేంద్రమంత్రి సృ‍్మతి ఇరానీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఒ బ్రియాన్ తదితరుల పదవీ కాలం ఆగస్టు 18వ తేదీతో ముగియనుండటంతో ఆ స్థానాలకు ఎన్నికలు జరుపుతామని తెలిపింది.
ఆగస్టు 18వ తేదీతో పదవీకాలం ముగియనున్న గుజరాత్, పశ్చిమబెంగాల్‌కు చెందిన 9 స్థానాలతోపాటు మేలో కన్నుమూసిన మధ్యప్రదేశ్‌కు చెందిన కేంద్రమంత్రి అనిల్ దవే స్థానంలో ఈ ఎన్నికలు అవసరమయ్యాయని తెలిపింది. ప్రస్తుతం రిటైరయ్యే వారిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు, కాంగ్రెస్‌కు ఇద్దరు, బీజేపీకి ఇద్దరు, సీపీఎంకు చెందిన ఒకరు ఉన్నారు. వీరంతా కూడా వచ్చే 17వ తేదీన జరిగే రాష‍్ట్రపతి ఎన్నికతోపాటు, వచ్చే నెల 5వ తేదీన జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారని సీఈసీ తెలిపింది.