కూకట్‌పల్లి (హైదరాబాద్): ‘‘ప్రజలు స్వేచ్ఛా పూరిత వాతావరణంలో ఓటు హక్కును విని యోగించుకునేలా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉండాలి. ఓటర్లను ప్రలోభపెట్టేలా, ఒత్తిడి చేసే లా అభ్యర్థులు వ్యవహరిస్తే వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ బాగా పనిచేసింది. కానీ ఓ అభ్యర్థి తనకు ఓటేయకపోతే ఆత్మ హత్య చేసుకుంటానంటూ ప్రచార మాధ్యమా లలోకెక్కారు. అది విచారకరం. ప్రజలను ఒత్తి డికి గురిచేసి గెలవడానికి అభ్యర్థి ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం సరి కాదు..’’అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ విమ ర్శించారు. గురువారం మేడ్చల్– మల్కాజ్‌గిరి జిల్లా కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన 14వ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. ప్రజలు ఓటు హక్కును ఆయుధంలా ఉపయోగించుకుని తమ జీవన పరిస్థితులకు మార్చుకోవచ్చని.. ఆ మార్పే దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుందని స్పష్టం చేశారు.
మంచి వారికి ఓటేయాలి..
తమ సమస్యలను వినడంతోపాటు అభివృద్ధి చేయగల సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే అవకా శం ఓటు ద్వారానే లభిస్తుందని.. అభ్యర్థుల గుణ గణాలను పూర్తిగా విశ్లేషించాకే ఓటేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. గుంతల రోడ్లను చూసి ఎమ్మెల్యేలు, ఎంపీలను తిట్టేకంటే ముందు మంచివారికి ఓటు వేయటం మంచి నిర్ణయమన్నారు.
ఓటింగ్ సమయంలో వచ్చిన సెలవులను ఉపయోగించుకొని కుటుంబంతో కలసి విహార యాత్రలకు వెళ్తున్నారని.. ఆ ఆలోచన సరికాదని స్పష్టం చేశారు. యువత ఓటు హక్కును తప్ప కుండా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ మాట్లా డుతూ.. 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు.
గెలవకుంటే శవయాత్ర అంటూ..
గతంలో కేసీఆర్ సర్కారు పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా సిఫార్సు చేయగా గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం, దీంతో కౌశిక్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనను గెలిపించకపోతే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఫలితాల తర్వాత తాను గెలిస్తే జైత్రయాత్ర, లేకుంటే శవయాత్ర జరుగుతుందని ఆయన పేర్కొనడం కూడా తీవ్ర దుమారం రేపింది. ప్రస్తుతం కౌశిక్‌రెడ్డిని ఉద్దేశిస్తూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment